Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరికొన్ని లగేజీ కేంద్రాలు.. ఎక్కడంటే..?
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో లగేజీ కేంద్రాలపై కీలక అప్టేట్ వచ్చింది. ఇప్పటికే భక్తులు తమ సామాన్లను భద్రపర్చుకునేందుకు కొన్ని లగేజీ కేంద్రాలు ఉండగా.. ఇప్పుడు అదనంగా మరికొన్ని అందుబాటులోకి తెచ్చారు. లగేజీ డిపాజిట్, డెలివరీ కేంద్రాలను ప్రారంభించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమలలో భక్తుల కోసం 80 లగేజీ కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కౌంటర్లలో 394 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో వీళ్లు నిరంతరం పనిచేస్తున్నారు. ఇక నుంచి 24 గంటల పాటు ఈ లగేజీ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. పండుగలు, ప్రత్యేక దినాల్లో భక్తులు లగేజీ కౌంటర్లను భారీగా ఉపయోగిస్తున్నారు. దీంతో నిరంతరం వీటిని అందుబాటులో ఉంచేలా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా కొత్తగా 80 కౌంటర్లను అందుబాటులోకి తెచ్చింది. కాలినడక మార్గాల్లో వీటిని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక లగేజీ కేంద్రాలు
చాలామంది అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. లగేజీతో నడిచి వెళ్లాలంటే చాలా కష్టం. అందుకే టీటీడీ లగేజీ కేంద్రాలను తీసుకొచ్చింది. ఇక నుంచి నిరంతరం ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. అలిపిరి కాలినడక మార్గంలో 7 కౌంటర్లు ఉండగా.. 46 మంది సిబ్బంది షిప్టుల వారీగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో 2 లగేజీ కౌంటర్లు ఉన్నాయి. ఇక్కడ 10 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ లగేజీ డిపాజిట్ చేస్తే డెలివరీ కేంద్రాల్లో తీసుకోవచ్చు. ఇక తిరుమలలో కూడా లగేజీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని ఫ్రీ హాల్‌లో 10 కౌంటర్లు భక్తుల కోసం ఉన్నాయి. ఇక తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 2 కౌంటర్లు, నారాయణగిరి షెడ్‌లో 8 కౌంటర్లు, డీడీ హల్‌లో 3 కౌంటర్లు, రూ.300 హాల్‌లో 5 కౌంటర్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ కంపార్ట్‌మెంట్ 3లో 2 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కళ్యాణ కట్ట సమీపంలో ప్రత్యేక డిపాజిట్, డెలివరీ కేంద్రాలు ఉన్నాయి.
తిరుమలలో త్వరలో ప్రత్యేక ల్యాబ్
ఇక తిరుమల లడ్డూ కల్తీ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 21వ తేదీన ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాబ్ ఏర్పాటుకు నిధులు కేటాయించింది. టీటీడీ, ఏపీ ఫుడ్ సేప్టీ అధికారులు ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
