AP KGBV: కేజీబీవీల్లో 840 మంది పీజీటీ ఉపాధ్యాయులను తొలగించిన ఏపీ సర్కార్.. కారణం ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీలు) పని చేస్తున్న దాదాపు 840 మంది పార్ట్ టైం, గెస్ట్ టీచర్ల ప్రభుత్వం తొలగించింది. ఏడెనిమిదేళ్లుగా పని చేస్తున్న వీరందరినీ ప్రభుత్వం అర్ధాంతరంగా రోడ్డున..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీలు) పని చేస్తున్న దాదాపు 840 మంది పార్ట్ టైం, గెస్ట్ టీచర్ల ప్రభుత్వం తొలగించింది. ఏడెనిమిదేళ్లుగా పని చేస్తున్న వీరందరినీ ప్రభుత్వం అర్ధాంతరంగా రోడ్డున పడేసింది. కాంట్రాక్టు పద్ధతిలో తమనే తీసుకోవాలని వారు కోరుతున్నా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. వీరిని ఎంపిక సమయంలోనూ విద్యార్హతలు, నమూనా తరగతులు నిర్వహించి తీసుకున్నప్పటికీ, ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపడుతున్నామంటూ వారందరినీ బయటికి పంపింది. కొత్త నియామకాల్లో తమను సర్దుబాటు చేయాలంటూ జూన్ 22న ఆందోళనలు నిర్వహించారు.
కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ బోధనకు పార్ట్‌టైమ్, గెస్ట్ అధ్యాపకుల పేరుతో గతంలో 840 మంది పీజీటీ టీచర్లను నియమించింది. తెలుగు, ఆంగ్ల సబ్జెక్టులకు 240 మంది వరకు ఉన్నారు. పోస్టుల సర్దుబాటు పేరుతో గతంలో నియమితులైన తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయినులను ఇంటికి పంపారు. కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో 1,543 నియామకాలకు గత నెలలో సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. పైగా వందకు వంద మార్కులంటూ వెయిటేజీ అంటూ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త నియామకాల్లో బోధన సర్వీసుకు ఏడాదికి అర మార్కు చొప్పున వెయిటేజీ ఇచ్చింది కూడా. ఏడెమిదేళ్లు పని చేసినా వీరందరికీ 4 మార్కులకు మించి రావడం లేదు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 4,243 మంది జాబితాను తాజాగా ఎస్‌ఎస్‌ఏ జిల్లాలకు పంపింది.
ఇందులో కొందరు అభ్యర్ధులకు వందకు వంద మార్కులు వచ్చినట్లు చూపారు. రాష్ట్ర స్థాయిలో మార్కులను పరిశీలన చేయకుండానే అభ్యర్థి నింపిన వివరాలను నేరుగా జిల్లాలకు పంపారు. ఆయా జిల్లాల్లో గురువారం ధ్రువపత్రాల పరిశీలన చేశారు. శుక్ర, శనివారాల్లో డెమో నిర్వహించి, ఆదివారం నియామక పత్రాలు ఇచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. దీంతో కొత్త నియామకాల పేరుతో భారీ మొత్తంలో పోస్టులను అధికారులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో డెమో, నైపుణ్యాల పరిశీలకు 15 మార్కులు వెయిటేజీ ఉండటంతో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.