Rampachodavaram: రగులుతోన్న రంపచోడవరం.. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ అభ్యర్థి..!
అల్లూరి జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ రగడ రోజురోజుకు రాజుకుంటోంది. తాజాగా టికెట్ విషయాన్ని మరోసారి పునః ఆలోచించాలంటూ నల్లజర్ల పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. నియోజకవర్గ సీటు విషయం ప్రస్తావన నా దగ్గర ఉందని సర్ధిచెప్పి పంపించేశారు అధినేత చంద్రబాబు.
అల్లూరి జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ రగడ రోజురోజుకు రాజుకుంటోంది. తాజాగా టికెట్ విషయాన్ని మరోసారి పునః ఆలోచించాలంటూ నల్లజర్ల పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. నియోజకవర్గ సీటు విషయం ప్రస్తావన నా దగ్గర ఉందని సర్ధిచెప్పి పంపించేశారు అధినేత చంద్రబాబు. దీంతో టికెట్ తిరిగి నాకే వస్తుంది అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారట వంతల రాజేశ్వరి. ఇప్పటికే టికెట్ ప్రకటించిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి తన ప్రచారాన్న తాన ప్రచారం మొదలు పెట్టారట.
ఏపీ కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి కాకుండా మిర్యాల శిరీషకు కేటాయించింది పార్టీ అధిష్టానం. దీంతో రంపచోడవరం నియోజకవర్గంలో వంతల రాజేశ్వరి కేడర్ విడిపోయి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. నియోజకవర్గంలో 11 మండలాల్లో టీడీపీ కార్యకర్తల్లో రాజేశ్వరికి మద్దతు పెరుగుతోందట..2014 ఎన్నికల్లో వైసీపీలో గెలుపొంది, తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతం చేస్తూ.. చంద్రబాబు జైల్లో ఉన్న 40 రోజులు దీక్షలతో, నియోజకవర్గంలో గ్రౌండ్ లెవల్ పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పై ప్రతిఘటించే నాయకురాలు వంతలకు ఇవ్వకపోతే, పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తలకు భరోసా ఎవరిస్తారని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి టికెట్ ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపించి, చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో కనీసం గ్రౌండ్ లెవల్‌లో ఎవరికి తెలియని వ్యక్తి తీసుకొచ్చి నిలబెట్టారంటూ.. వంతల రాజేశ్వరి కి తీవ్ర అన్యాయం చేశారని ప్లకార్డులతో నిరసనల బాట పట్టారు. ఈనేపథ్యంలోనే ఉండవల్లిలో తన అనుచరులతో కార్లతో భారీ కాన్వాయ్ లో చంద్రబాబును కలిసి రంపచోడవరంలో టికెట్ తనకే ఇవ్వాలని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. వంతల రాజేశ్వరికి సర్ధిచెప్పి పంపించేశారు అధినేత చంద్రబాబు. ఐదేళ్ళపాటు పార్టీలో కష్టపడిన తనకే ఇవ్వాలని చంద్రబాబును, సీనియర్ నేతలను కలిసి రిక్వేస్ట్ చేశారు. రంపచోడవరంలో టీడీపీ గెలుపునకు టికెట్‌పై పునరాలోచించాలంటూ వరుస వినతులతో టికెట్ అభ్యర్థిస్తున్నారు రాజేశ్వరి.
రంపచోడవరంలో కనుమరుగైన అయిన టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజేశ్వరి విశ్వప్రయత్నాలు చేశారంటున్నారు స్థానిక నేతలు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబును ఎదుర్కొంటూ తనపై కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టినా పార్టీని వదలకుండా ముందుకు తీసుకెళ్లారు. అయితే అసెంబ్లీ టికెట్ మిర్యాల శిరీషకు ఇవ్వడం పట్ల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజల, కార్యకర్తలులో ఆధిక్యత, సింపతితో గెలిచే అవకాశం ఎక్కువగా వంతల రాజేశ్వరికే ఉన్నట్లు విశ్లేషకులతో పాటు, ఓ సర్వే రిపోర్ట్ చెబుతున్నాయట. అలాగే రంపచోడవరం టీడీపీ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు కూడా ఓ ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని వెల్లడించారు.
మిర్యాల శిరీషకు టికెట్ ఇవ్వడంతో వైసీపీ గత ఎన్నికల కంటే మరింత ఎక్కువ మెజార్టీ ఉంటుందని అధికార పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మరోపక్క వంతల రాజేశ్వరికి టీడీపీ టికెట్ ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేపడతామని, పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం కష్టపడి పని చేసిన వారికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వలేదని, మనస్తాపంతో ఎలిపే నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందడంతో పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది.
అయితే పార్టీలో రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల కీలక టీడీపీ నాయకులు అసమ్మతితో సమావేశమై చంద్రబాబుకు టికెట్ వంతల రాజేశ్వరికి ఇవ్వాలని లేఖలు కూడా పంపుతున్నారట. ఏజెన్సీలో అనంత బాబును ఎదుర్కొని, టీడీపీ జెండా రంపచోడవరంలో ఎగిరెలా చేస్తామని అధిష్టానంకు మొర పెట్టుకుంటున్నారట. ఏది ఏమైనా అధిష్టానం రంపచోడవరం టికెట్ పై త్వరగా పూర్తి స్థాయిలో మార్చే ఆలోచన చేయాలని టీడీపీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నారట. చూడాలి మరీ తాజాగా చంద్రబాబును కలిసిన వంతల రాజేశ్వరికి తిరిగి మళ్ళీ టికెట్ ఇస్తారా..? ఇప్పటికే అనపర్తి టీడీపీ టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తున్నట్లు చంద్రబాబు హామీ ఇవ్వడంతో.. రంపచోడవరం టీడీపీ టికెట్‌పై కూడా అశలు పెట్టుకున్నారు వంతల రాజేశ్వరి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…