Andhra Pradesh: ప్రేమే పాశమైంది.. ఊరు విడిచినా ప్రేమికుడిని వదలని మృత్యువు.. ఎంత దారుణంగా నరికి చంపారంటే..
ఆహ్లాదకరంగా ఉండే సముద్రతీరం ఉలికిపాటు పడింది. చేపలను వేటాడే వాళ్లు.. ఓ మనిషిని వేటాడారు. కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. కత్తులతో నరికారు.

ఆహ్లాదకరంగా ఉండే సముద్రతీరం ఉలికిపాటు పడింది. చేపలను వేటాడే వాళ్లు.. ఓ మనిషిని వేటాడారు. కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. కత్తులతో నరికారు. పట్టపగలు ఫ్యాక్షన్ సినిమాను తలదన్నే రీతిలో జరిగిన ఈ హత్యాకాండ భోగాపురం మండలం చేపల కంచేరును వణికించింది. హతుడి ఇంట్లోనే జరిగిన ఈ దారుణ కాండ ఊరిని భయపెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఈ హత్యకు కారణమేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కత్తులతో వేట..కసితీరా హత్య.. కుండలో వండిన చేపల కూర నెత్తిన పోసి.. కర్రలతో కొడుతూ.. కత్తులతో నరుకుతూ.. రాడ్లతో కసితీరా బాది చంపేశారు. ఇంతటి దారుణానికి కారణం ప్రేమ. అవును, ప్రేమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలి బంధువులే ప్రియుడిని వెంటాడి వేటాడి తెగ నరికారు. అక్టోబర్ 31న భోగాపురం మండలం చేపల కంచేరులో పట్టపగలే ఉరుకుల పరుగుల వేట సాగింది. చంపి తీరాలని కొందరు.. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఒక్కడు. ఊరంతా పరుగులు..చివరకు తన ఇంట్లోకే వెళ్లాడు. అక్కా.. అమ్మా.. తలుపులు మూసేయండి.. గేటుకు తాళం వేయండి. వాళ్లు నన్ను చంపడానికొచ్చారు. అని గట్టిగా అరుపులు.. ఇంట్లో ఉన్న ఆడోళ్లంతా అదిరిపడ్డారు. కొద్దిసేపు.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అప్పటికే అతడి కళ్లల్లో కారం కొట్టారు. కళ్లు మంటలు.. కాళ్లు తడబడుతూ.. పరిగెడుతూ వచ్చినా.. అతడి వెంటే ఇంట్లోకి జొరబడిన వాళ్లు ప్రాణం తీసే వరకు కొట్టారు నరికారు. ఇక చనిపోయాడనుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. 108 వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాక కానీ.. తెలియదు అతడు చావలేదని.. ఆ తర్వాత.. పది రోజులు మృత్యువుతో పోరాడాడు. చివరకు బుధవారం చనిపోయాడు.
భోగాపురం మండలం ముక్కాంకు చెందిన వాసుపల్లి ఎల్లాజీ కొన్నేళ్ల క్రితం విశాఖ వలస వెళ్లాడు. అక్కడే ఉంటున్నారు. ముక్కాంలో పుట్టినా.. అమ్మమ్మ ఊరు చేపల కంచేరులోనే పెరిగాడు. బాల్యమంతా అక్కడే గడిచింది. యుక్త వయసు రాగానే గ్రామంలో ఉన్న ఓ యువతితో లవ్‌లో పడ్డాడు. అమ్మాయి కూడా ఎల్లాజీ ప్రేమకు ఒప్పుకుంది. ఇద్దరూ లవ్‌లో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి తరపు వాళ్లకు తెలిసింది. గొడవలు మొదలయ్యాయి. ఇలా రెండేళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో.. ఎల్లాజీ చేపల కంచేరు నుంచి విశాఖకు మకాం మార్చాడు.




ఫోన్‌లో ప్రేమ రాయబారం..
ఎల్లాజీ విశాఖకు వెళ్లడంతో గొడవలు సద్దు మణిగాయి. ఇద్దరి మధ్య ప్రేమ బంధం తెగిపోయిందనుకున్నారు. కానీ.. ఎల్లాజీ విశాఖ వెళ్లినా.. ఫోన్ ద్వారా లవ్‌ట్రాక్ నడుస్తూనే ఉంది. ఇది కూడా యువతి పేరెంట్స్‌కు తెలిసింది. అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు రగిలిపోయారు. ఎల్లాజీపై రివెంజ్ తీర్చుకోవాల్సిందేనని కసిగా ఫిక్సయ్యారు. అదును కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడే..వెతకబోయే తీగ కాలికి తగిలిందన్నట్లు.. ఎల్లాజీ అక్టోబర్ ఫ్రెండ్స్‌తో కలిసి అక్టోబర్ 31న అమ్మమ్మ ఊరికొచ్చాడు. ఎల్లాజీ వచ్చాడని తెలుసుకున్న మైలపల్లి నరేష్ అనే అమ్మాయి బంధువు.. ఇతర కుటుంబ సభ్యులు కలిసి మర్డర్ స్కెచ్ వేశారు.
ఎల్లాజీ గొడవకే వచ్చాడనుకున్నారు..
అయితే అప్పటికే.. ఇరువురి మధ్య గొడవలు జరిగాయి కాబట్టి ఎల్లాజీ కూడా ఏదో ఒకటి చేయాలనే స్నేహితులను తెచ్చుకున్నాడనే అభిప్రాయానికి వచ్చారు నరేష్ గ్యాంగ్. ఎల్లాజీ మాత్రం.. తన అక్క, అమ్మమ్మలను కలిసి బైక్ పై స్నేహితుడితో.. విశాఖ రిటర్న్ అయ్యాడు. అప్పటికే వెయిటింగ్‌లో ఉన్న నరేష్ బ్యాచ్.. ఎల్లాజీపై దాడికి దిగారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఎల్లాజీ..అమ్మమ్మ ఇంటికి పరిగెత్తాడు. ప్రత్యర్థులు కూడా కర్రలు, కత్తులు, రాడ్లతో వెంటాడారు. అప్పటికే అతడి కళ్లలో కారం కొట్టారు. అరుస్తూ పరిగెత్తుతూ అక్కా అక్కా అని వచ్చిన ఎల్లాజీని అతడి ఇంట్లో పెట్టి తాళం వేసింది. అయినా వెంటాడిన వాళ్లు వెనకడుగు వేయలేదు. తాళం పగుల గొట్టారు. అడ్డొచ్చిన ఎల్లాజీ అక్కపైనా దాడి చేశారు. కుటుంబ సభ్యులను వదల్లేదు. ఈ దారుణ కాండలో పిల్లలకు గాయాలయ్యాయి. నట్టింట్లో ఎల్లాజీని నరికేశారు. ఇల్లంతా నెత్తుటి మయం.. ఊరంతా భయానకం. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఎల్లాజీని అతి కష్టమ్మీద ఆస్పత్రికి తరలించారు అతని కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ పది రోజుల తర్వాత చనిపోయాడు.
ఈ ఘటనతో ఊరంతా అల్లకల్లోలంగా మారింది. దాంతో అలర్ట్ అయిన పోలీసులు ఊరంతా పికెట్ పెట్టారు. నిందితులందరినీ అరెస్ట్ చేశారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ ఎల్లాజీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియురాలికి దూరంగానే ఉన్నాడు.. అమ్మమ్మ, అక్కలను చూసి పోదామని వచ్చిన ఎల్లాజీ..చివరకు హతమయ్యాడు. ప్రేమ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమంటే ఇదేకదా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
