Andhra Pradesh: కృష్ణా తీరంలో పరుగులు తీస్తున్న వందలాది మంది జనాలు.. ఎందుకో తెలిస్తే మీరూ వెళ్తారు..!
Diamond Hunt: తొలకరి జల్లుకురిసిందంటే చాలు. అక్కడికి జనం పరుగులు పెడతారు. ఒక్కరో ఇద్దరో కాదు. వందలాది మంది.

Diamond Hunt: తొలకరి జల్లుకురిసిందంటే చాలు. అక్కడికి జనం పరుగులు పెడతారు. ఒక్కరో ఇద్దరో కాదు. వందలాది మంది. ఇంతకీ ఎందుకంటారా? వర్షాకాలం మొదలైతే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట మొదలౌతుంది. ఒకనాడు వజ్రాలకు పెట్టని కోటగా ఉన్న కృష్ణాతీరంలో ఇప్పుడు సైతం జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల శివార్లలో కృష్ణా నది ఒడ్డును వజ్రాల కోసం పెద్ద ఎత్తున్న అన్వేషణ సాగిస్తోన్న వేటగాళ్ళతో కృష్ణాతీరం సందడిగా మారింది. ఒకనాడు కృష్ణానదీతీరం వజ్రాల గనులకు పెట్టింది పేరు. ఒకప్పుడు కాదు. ఇప్పుడు కూడా కంచికచర్ల పరిధిలోని పరిటాల, చందర్లపాడు, గుడిమెట్ల తదితర ప్రాంతాల్లో వానజల్లు కురిసిందంటే ఇప్పటికీ వజ్రాల కోసం వేటమొదలౌతుంది. ఒక్కరో ఇద్దరో కాదు. ప్రతిరోజూ 300 మందికి పైగా పనికి వెళ్లినట్టు చద్దికట్టుకెళ్ళి, వజ్రాలకోసం పొద్దుపోయే వరకు వెతుకుతారు.
లక్కు తగిలిందా లక్షాధికారే. లేకపోయినా అక్కడ దొరికే రంగు రంగుల రాళ్ళతో కూలిగిట్టుబాటు అవడం ఖాయం. అందుకే జనం వర్షాకాలంలో కృష్ణమ్మ తీరానికి పరుగులు పెడతారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా అంటే ఏకంగా కోహినూర్ వజ్రం దొరికిందే అక్కడేనన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. నిజానికి చందర్లపాడు మండలంలో ఒకప్పుడు వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే ఈ కథల్లో నిజం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది.




పోలీసుల వార్నింగ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో వజ్రాల వేటగాళ్లకు పండగలా మారింది. ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్ళు తరలివస్తున్నారు. అయితే మరోవైపు ప్రభుత్వం కృష్ణాతీరంలో వజ్రాల తవ్వకాలపై నిషేధం విధించింది. వజ్రాల అన్వేషణ నిషేధమన్న పోలీసుల హెచ్చరికలను లెక్కచేయని వజ్రాల వేటగాళ్లు తమ పనిలో తామున్నారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..