Andhra: ఏపీని దడపుట్టిస్తోన్న తుఫాన్.. అమ్మబాబోయ్.! ఈ జిల్లాలకు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఏయే జిల్లాలకు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందో ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో చూసేద్దాం పదండి.! ఓ సారి లుక్కేయండి.

తుఫాన్ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. విశాఖ, కోస్తా జిల్లాల్లో తీరం వెంట వర్షం మొదలైంది. 24 గంటల్లో అతి భారీవర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తోంది. రేపు 110 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం వరకూ ఏపీకి తుఫాన్ ముప్పు కొనసాగుతుందన్నారు.
నెల్లూరులో 9 మండలాల్లో 42 గ్రామాల్లో హైఅలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పశ్చిమ గోదావరి జిల్లాలో 16 తుఫాన్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది. భీమవరం, తాడేపల్లిగూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. కాకినాడ, ఉప్పాడ, యానాం-ఎదురుల్లంక సహా.. గోదావరి లంక గ్రామాల్లో ఈదురు గాలులతో అల్లకల్లోలంగా మారాయి. మచిలీపట్నం తీరప్రాంతాలకు NDRF టీమ్‌లు చేరుకున్నాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 3 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మరోవైపు గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదులుతోందని అన్నారు. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి..అప్రమత్తంగా ఉండని వాతావరణ శాఖ పేర్కొంది.




