Andhra: నాగపంచమి రోజున అద్భుత దృశ్యం.. చూసేందుకు రెండు కళ్లు చాలవు
నాగపంచమి రోజున భక్తులకు అద్భుత దృశ్యం కంటపడింది. అది చూసి భక్తులే కాదు.. అర్చకుడు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆపై స్నేక్ క్యాచర్‌ను పిలిచి.. పట్టించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా అద్భుత ఘట్టాలు జరుగుతున్నాయి. నాగుల చవితి రోజున శ్రీకాకుళం జిల్లా పలాస మండశాసనంలో భక్తులు పుట్ట వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా భారీ నాగుపాము పుట్టలోంచి బయటకు వచ్చి భక్తులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అంతేకాదు పుట్ట వద్ద మట్టి పాత్రలో భక్తులు వేసిన పాలను పాము తాగటం మరో విశేషం. అయితే ఇది మరువకుముందే మరుసటి రోజు ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణి వీధిలో మరో అద్భుతం జరిగింది. మహిమో లేక యాదృచ్చికమో తెలియదు గాని భారీ నాగుపాము ఆలయ గర్భగుడిలోని శివలింగం వద్ద కనిపించింది.
శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పి బుసలు కొడుతూ దర్శనం ఇచ్చింది. అప్పటికే శివలింగంపై స్వామివారికి అలంకారంగా ఉంచిన పడగ విప్పి ఉన్న పంచలోహ సర్ప విగ్రహం ఉండగా దాని పక్కన ఇంచుమించు అదే హైట్‌లో పడగ విప్పుతూ నాగుపాము ఆలయ అర్చకునికి దర్శనం ఇచ్చింది. పామును చూసిన అర్చకుడు మొదట కంగారుపడ్డారు. తర్వాత స్వామివారి మహిమ అని భావించి దూరంగా ఉంటూ పూజలు నిర్వహించారు. అయితే అది ఎప్పటికీ కదలకుండా చాలాసేపు శివలింగం వద్దే పడగ విప్పి ఉండటంతో ఓంకార్ అనే స్నేక్ క్యాచర్‌కి ఫోన్ చేసి రప్పించగా అతను వచ్చి పామును నెమ్మదిగా పట్టి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతంలో దానిని విడిచిపెట్టారు. శివలింగంపై పాము పడగ విప్పి ఉందంటూ తెలిసి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. అసలే కార్తీకమాసం దానికి తోడు నాగ పంచమి పర్వదినం రోజున ఈ ఘటన జరగటంతో భక్తులు దీనిని మహిమగా చెప్పుకుంటున్నారు.




