Tirupati: కూతురు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చి.. డ్రైనేజీలో శవమై తేలిన తండ్రి..
కూతురు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన తండ్రి తెల్లారే సరికి విగతజీవిగా మారాడు. ఆసుపత్రి ఆవరణలో ఉండేందుకు సిబ్బంది నిరాకరించడంతో విధిలేని పరిస్థితిలో ఆసుపత్రి పక్కనే ఉన్న డ్రైనేజీ గోడపై నిద్రపోయాడు. నిద్రమత్తులో ప్రమాదవశాత్తు అతను పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. చీకట్లో ఎవరూ గమనించకపోవడంతో తెల్లారే సరికి డ్రైనేజీలో విగత జీవిగా మారాడు. సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకం ఒక వ్యక్తి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. కూతురుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆ తండ్రి డ్రైనేజీలో పడి మృత్యువాత..
తిరుపతి, సెప్టెంబర్ 26: కూతురు వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన తండ్రి తెల్లారే సరికి విగతజీవిగా మారాడు. ఆసుపత్రి ఆవరణలో ఉండేందుకు సిబ్బంది నిరాకరించడంతో విధిలేని పరిస్థితిలో ఆసుపత్రి పక్కనే ఉన్న డ్రైనేజీ గోడపై నిద్రపోయాడు. నిద్రమత్తులో ప్రమాదవశాత్తు అతను పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. చీకట్లో ఎవరూ గమనించకపోవడంతో తెల్లారే సరికి డ్రైనేజీలో విగత జీవిగా మారాడు. సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకం ఒక వ్యక్తి ప్రాణాలు పోయేందుకు కారణమైంది. కూతురుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆ తండ్రి డ్రైనేజీలో పడి మృత్యువాత పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకెళ్తే..
తొట్టంబేడు మండలం దిగువ సుబ్బరాయ పాలెంకి చెందిన చల్లారెడ్డి కూతురు పోలమ్మకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం నిన్న శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. రాత్రి సమయంలో మగవాళ్లు హాస్పిటల్ లో వేచి వుండేందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది చల్లారెడ్డిని బయటికి పంపారు. ఆసుపత్రిలో ఉన్న పేషంట్ అటెండర్ల కోసం నిర్మించిన భవనం గత కొన్ని నెలలుగా తాళం వేసి ఉండడంతో విధిలేని పరిస్థితిలో ఆసుపత్రి గేటు దాటి వచ్చిన చల్లారెడ్డి డ్రైనేజీ కల్వర్టు పై నిద్ర పోయాడు.
రాత్రి ఆసుపత్రిలో అనుమతించక పోవటంతో హాస్పిటల్ గేట్ వద్ద డ్రైనేజీ కల్వర్టు గోడ పైనే పడుకున్న చల్లారెడ్డి నిద్రమత్తులో పక్కనున్న మురికి కాలువలో పడి పోయాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో అపస్మారక స్థితిలో ఊపిరాడక చల్లారెడ్డి చనిపోయాడు. ఉదయం కుటుంబ సభ్యులు చల్లారెడ్డి కోసం వెతుకుతుండగా గేట్ వద్ద కల్వర్టు పక్కనే చెప్పులను చూసి గుర్తించారు. ఆసుపత్రి ముందు మురికి కాలువలో విగతజీవిగా పడివున్న చల్లారెడ్డి డెడ్ బాడీ ని గుర్తించారు. డ్రైనేజ్ నుంచి మృతదేహాన్ని స్థానికులు వెలికితీయగా మృతుని బార్య , బంధువులుకన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు పై విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.