CUET UG 2026 Exam Date: సీయూఈటీ యూజీ-2026 పరీక్ష తేదీ వెల్లడి.. వెబ్‌సైట్‌లో కీలక సూచనలు
దేశంలోని 47 సెంట్రల్ వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఎన్టీయే కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఈసారి దరఖాస్తు సమయంలో కొన్ని ముఖ్య డాక్యుమెంట్లను సమర్పించవల్సి ఉంటుందని, వాటిని నోటిఫికేషన్ కు ముందే అప్ డేసు కోవాలని సూచించింది..

హైదరాబాద్, డిసెంబర్ 29: దేశ వ్యాప్తంగా ఉన్న 47 సెంట్రల్ వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ, బీటెక్ వంటి తదితర అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు యేటా సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 2026-27 విద్యా సంవత్సరానికి సీయూఈటీ – యూజీ (CUET- UG 2026) పరీక్ష నిర్వహణకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలను మే నెలలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన విడుదల చేసింది. యూజీ కోర్సుల్లో ప్రవేశానికి మొత్తం 13 మాధ్యమాల్లో సీయూఈటీ యూజీ పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ క్రమంలో సీయూఈటీ 2026 ప్రవేశ పరీక్ష సిలబస్‌ను యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చెందిన వివరాలను త్వరలోనే అందుబాటులో ఉంచనుంది. అయితే దరఖాస్తు సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని యూజీసీ పేర్కొంది. ముఖ్యంగా ఆధార్‌లో పుట్టిన తేదీ, పేరు, అడ్రస్ పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం సరిపోయేలా ఉండాలని, ఇందులోని ఫొటోను కూడా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే దివ్యాంగ అభ్యర్ధులైతే యూడీఐడీ కార్డు చెల్లుబాటు అయ్యేలా దానిని రెన్యువల్ చేయించుకొని అప్‌డేట్‌గా ఉంచుకోవాలని తెలిపింది. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-ఎన్‌సీఎల్ వంటి కేటగిరీ సర్టిఫికెట్‌లను చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. తద్వారా దరఖాస్తు సమయంలో ఇబ్బందులు తప్పుతాయని వివరించింది.
ఇక సీయూఈటీ యూజీ 2026 ఆన్‌లైన్ పరీక్షలు మే 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది. అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://nta.ac.in, https://cuet.nta.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోవాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




