Vijay Hazare Trophy : 23 ఫోర్లు, 3 సిక్సర్లు 130 బంతుల్లోనే 182 పరుగులు..స్టేడియంలో నాగాల్యాండ్ బ్యాటర్ వీరవిహారం
Dega Nischal విజయ్ హజారే ట్రోఫీలో నాగాలాండ్ బ్యాటర్ డెగా నిశ్చల్ 182 పరుగులతో రికార్డు సృష్టించాడు. 26 బౌండరీలతో మిజోరం బౌలర్లను ఊచకోత కోశాడు. 110 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. నిశ్చల్ వీరబాదుడు ధాటికి నాగాలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరును సాధించింది.

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది. రాంచీలోని జేఎస్సీఏ ఓవల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ ఓపెనర్ డెగా నిశ్చల్ విధ్వంసం సృష్టించాడు. మిజోరం బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 130 బంతుల్లోనే 182 పరుగులు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిశ్చల్ వీరబాదుడు ధాటికి నాగాలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరును సాధించింది.
బౌలర్లకు చుక్కలే
డెగా నిశ్చల్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం 23 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. అంటే ఏకంగా 110 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. 140 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ వన్డే క్రికెట్‌లో టీ20 రేంజ్ వినోదాన్ని పంచాడు. నాగాలాండ్ క్రికెట్ చరిత్రలో లిస్ట్-ఏ (వన్డే) మ్యాచ్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు ఇదే సీజన్‌లో రూపేరో చేసిన 138 పరుగుల రికార్డును నిశ్చల్ చెరిపివేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే మిజోరం జట్టుపై ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక స్కోరుగా కూడా ఇది రికార్డు సృష్టించింది.
ఎవరీ డెగా నిశ్చల్?
నిశ్చల్ పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతంలో కర్ణాటక తరపున ఆడేవాడు, కానీ మెరుగైన అవకాశాల కోసం నాగాలాండ్ జట్టుకు మారాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిశ్చల్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 2,299 పరుగులు చేశాడు. అతని సగటు 46.91గా ఉండటం విశేషం. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా తన ఫామ్ కొనసాగిస్తూ ఈ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లోనే 65 సగటుతో 192 పరుగులు సాధించాడు.
నాగాలాండ్ క్రికెట్ కొత్త ఆశాకిరణం
ఒకప్పుడు పసికూనగా భావించిన నాగాలాండ్ జట్టు ఇప్పుడు డెగా నిశ్చల్ వంటి ఆటగాళ్ల రాకతో బలమైన జట్టుగా ఎదుగుతోంది. మిజోరంపై చేసిన ఈ 399 పరుగుల స్కోరు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కేవలం నిశ్చల్ మాత్రమే కాదు, సెడెజాలీ రూపేరో కూడా ఈ సీజన్లో వరుసగా రెండు సెంచరీలు (138, 124 పరుగులు) బాది నాగాలాండ్ తరపున అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో నిలిచారు. ఈ భారీ ఇన్నింగ్స్‌తో నిశ్చల్ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని కూడా ఆకర్షించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
