Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ongole: ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమైన కళారాల సంబరం.. 300 ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయం

కళారాల సంబరం... ఒంగోలులో ప్రత్యేకం! దసరా ఉత్సవాల్లో కళారాల ఉరేగింపు మైసూరు, కలకత్తా తరువాత రెండు తెలుగురాష్ట్రాల్లో ఒక్క ఒంగోలులోనే నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు నగరానికే ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దుర్గాష్టమి, నవమి రోజున నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించటం సాంప్రదాయంగా..

Ongole: ఒంగోలులో అట్టహాసంగా ప్రారంభమైన కళారాల సంబరం.. 300 ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయం
Kalarala Sambaram In Ongole
Follow us
Fairoz Baig

| Edited By: Narender Vaitla

Updated on: Oct 22, 2023 | 10:27 PM

ఒంగోలు , అక్టోబర్ 22: కళారాల సంబరం… ఒంగోలులో ప్రత్యేకం! దసరా ఉత్సవాల్లో కళారాల ఉరేగింపు మైసూరు, కలకత్తా తరువాత రెండు తెలుగురాష్ట్రాల్లో ఒక్క ఒంగోలులోనే నిర్వహిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు నగరానికే ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దుర్గాష్టమి, నవమి రోజున నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించటం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అమ్మవార్ల కళారాల ఊరేగింపు కోసం రంగం సిద్దమైంది… ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికమ్మ, పసుపువర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గమ్మ, తెలుపువర్ణంలో బీవీఎస్‌ హాలు దగ్గరున్న నరసింహస్వామి కళారాలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగనున్నాయి. మైసూరు, కలకత్తాల తరువాత ఒంగోలు నగరంలో మాత్రమే ఈ కళారాల ప్రదర్శన జరుగుతుంది. 4 వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

దసరా పండుగ సందర్బంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కళారాల ఊరేగింపునకు ఓ ప్రత్యేకత ఉంది. మైసూరు, కలకత్తాల తరువాత ఒక్క ఒంగోలులోనే ఈ విధమైన కళారాలను ప్రదర్శిస్తారు. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన అమ్మవారు. అదే రౌద్ర రూపంతో ఊరేగింపునకు బయల్దేరుతుంది.

దుష్టశిక్షణ చేయటానికి అమ్మవారు రౌద్రరూపిణిగా అవతరించిందనే దానికి సంకేతంగా ఎరుపు వర్ణం, సకల శుభాలను కలిగించే మాతృమూర్తికి చిహ్నంగా పసుపువర్ణంలో అమ్మవారి కళారాలు దర్శనమిస్తాయి. అమ్మవారితో పాటు నరసింహస్వామి కళారం కూడా బయలుదేరుతుంది… హిరణ్యకశిపుని సంహారం తర్వాత అమ్మవారి ఆదేశం మేరకు శాంతమూర్తిగా మారిన నరసింహస్వామికి చిహ్నంగా స్వామి వారు తెలుపువర్ణ కళారం ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ధరించిన వివిధ వేషధారణలు ఆకట్టుకుంటాయి… పౌరాణిక పద్యాల ఆలాపనలు ప్రజలను రంజింపజేశాస్తాయి… డప్పు వాయిద్యాలు, డీజే వాయిద్యాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హుషారెత్తిస్తాయి… ఒంగోలు నగరంలోని పలు వీధులగుండా అర్దరాత్రి బయలుదేరే ఈ కళారాలు ఊరేగింపు ఉదయానికి స్థానిక మస్తాన్‌ దర్గా సెంటర్‌కు చేరుకుంటాయి… ఆ సందర్భంగా మూడు కళారాలకు భక్తులు నీరాజనాలర్పిస్తారు…

ఇవి కూడా చదవండి

అర్దరాత్రి సంబరాలు ప్రారంభం…

ఒంగోలు నగరంలోని మూడు ప్రధాన దేవాలయాలనుంచి తొలిరోజు అర్ధరాత్రి మూడు కళారాలు బయలుదేరుతాయి. భేరీనాదాలూ, చిత్ర విన్యాసాలూ, విచిత్ర వేషధారణలూ ఆ కోలాహలానికి తోడవుతాయి. ఎంత సందడి ఉన్నా నగరోత్సవానికి ప్రధాన ఆకర్షణ అమ్మవారి కళారాలే. నాలుక చాచిన ఆ ముఖచిత్రాలను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. దసరా సమయంలో దేశంలో మైసూరు, కలకత్తా నగరాల తరువాత ఒక్క ఒంగోలు నగరంలోనే ఇలాంటి ఉత్సవం జరుగుతుందని సగర్వంగా చెబుతారు స్థానికులు. పురాణ కథనం ప్రకారం శుంభునిశుంభులు, మధుకైటభులు.. ఒకరా ఇద్దరా, ఎంతోమంది రాక్షసులు నేలకొరిగారు. రక్తబీజుడి వంతు వచ్చింది. అతని ఒంట్లోంచి పడే ప్రతి రక్తపుచుక్క నుంచీ మరో రక్తబీజుడు పుడతాడు. పరమేశ్వరుడు అతనికా వరం ఇచ్చాడు. మహాకాళి ఆ లోకకంటకుడిని ఎలా సంహరిస్తుందా అని ముక్కోటి దేవతలూ ఆకాశంలోంచి ఉత్కంఠతతో చూడసాగారు.

అమ్మ తన నాలుకను భీకరంగా చాచింది. జిహ్వ పెరిగి పెద్దదై రక్షక్షేత్ర మైంది. ఆఖరి చుక్క వరకూ ఆ రాక్షసుడి రక్తాన్ని పీల్చేసుకుంది మహాకాళి. అసుర సంహారం తర్వాత కూడా ఆమెలోని రౌద్రాంశ శాంతించలేదు. దేవతలు, మునులు స్తుతించడంతో శక్తిస్వరూపిణి కాస్త కరుణించింది. నాలుక బయటకు చాచిన తన శిరస్సును ఎవరైతే ఘనంగా ఊరేగిస్తారో, భక్తితో పూజిస్తారో ఆ గ్రామానికి కానీ, నగరానికి కానీ ఎటువంటి దుష్టశక్తుల భయం ఉండదని అభయమిచ్చింది. ఒంగోలులో నగరోత్సవం నాలుగు వందల ఏళ్ల నాడు ప్రంభమైనట్టు స్థానికులు చెబుతారు. అప్పట్లో అమ్మవారి శిరస్సు ఆకారాన్ని అట్టలతో రూపొందించి.. గూడు బండ్లు కట్టి ఊరేగించే వారు. వందేళ్ల కిందటి నుంచి అట్టల స్థానంలో రాగి రేకునూ, ఇతర లోహాల మిశ్రమాన్ని వాడటం మొదలు పెట్టారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వాహనం మీద అలం కరించడం, శిరస్సు కదులుతున్నట్లుగా తిప్పడం కష్టమైన పనే. ఓ ప్రత్యేక బృందం ఈ బాధ్యత తీసుకుంటుంది.

ఆరు కళారాలు…

ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి- అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన. అన్నీ ఒకచోట.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరతారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తి స్తుంటారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో…. కోలాహలమంతా ఇక్కడే కొలువుంటుంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించడం తమ అదృష్టమని భావిస్తారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూస్తారు… మరుసటి రోజు ఉదయానికి అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకుంటాయి. టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకుంటారు భక్తులు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమికూడతారు. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకంగా ఉంటుందని ఆలయ పూజారులు, నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.