Zombie Drug: మానవ ఎముకలతో డ్రగ్స్‌ తయారీ.. సమాధులను తవ్వి శవాలను దొంగిలిస్తున్న ముఠా!

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో మానవ ఎముకలతో తయారు చేసిన 'కుష్‌' సైకోయాక్టివ్ డ్రగ్స్‌ కలకం సృష్టిస్తున్నాయి. ఈ డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత పిట్టల్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లలోనే ఆ దేశంలో కుష్‌ డ్రగ్స్‌ వినియోగం ప్రబలంగా ఉంది. దీంతో సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆయన ఈ బయో డ్రగ్‌ను 'డెత్ ట్రాప్'గా వ్యవహరించారు..

Zombie Drug: మానవ ఎముకలతో డ్రగ్స్‌ తయారీ.. సమాధులను తవ్వి శవాలను దొంగిలిస్తున్న ముఠా!
Zombie Drug
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2024 | 5:57 PM

సియెర్రా లియోన్, ఏప్రిల్‌ 9: పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో మానవ ఎముకలతో తయారు చేసిన ‘కుష్‌’ సైకోయాక్టివ్ డ్రగ్స్‌ కలకం సృష్టిస్తున్నాయి. ఈ డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత పిట్టల్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లలోనే ఆ దేశంలో కుష్‌ డ్రగ్స్‌ వినియోగం ప్రబలంగా ఉంది. దీంతో సియెర్రా లియోన్ అధ్యక్షుడు జూలియస్ మాడా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆయన ఈ బయో డ్రగ్‌ను ‘డెత్ ట్రాప్’గా వ్యవహరించారు. ఈ డ్రగ్‌ తయారీలో వినియోగించే రకరకాల విష పదార్ధాల్లో మానవ ఎముకలు ఒకటి. దీంతో డ్రగ్‌ పెడ్లర్లు ఆ దేశంలోని సమాధులను తవ్వి శవాలను ఎత్తుకుపోయి ‘కుష్‌ డ్రగ్’ తయారు చేస్తున్నారు. డ్రగ్స్‌ తయారు చేయకుండా నిరోధించడానికి శ్మశానవాటికలలో పోలీసు బలగాలను మోహరింపజేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.

కుష్‌ డ్రగ్‌కు బానిసలైన యువత సియెర్రా లియోన్‌ వీధుల్లో గుంపులు గుంపులుగా వీధి మూలల్లో కూర్చుని కనిపిస్తున్నారు. ఈ డ్రగ్‌ వినియోగం వల్ల ఇటీవల కాలంలో వందలాది మంది యువత అవయవ వైఫల్యంతో ఆస్పత్తుల్లో చేరుతున్నారు. ఈ సైకోయాక్టివ్ పదార్ధం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సియెర్రా లియోన్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో ఈ రకమైన డ్రగ్‌ బాధితుల సంఖ్య 2020-2023 మధ్య దాదాపు 4,000 శాతం పెరిగినట్లు వెళ్లడించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే కుష్‌ కేసుల సంఖ్య1,865కి చేరుకున్నట్లు పేర్కొంది.

కుష్ డ్రగ్ మొదటిసారిగా ఆరేళ్ల క్రితం సియెర్రా లియోన్‌లో కనిపించింది. ఈ దేశంలో కుష్‌ డ్రగ్స్‌ అధిక డిమాండ్‌ ఉంది. దీంతో డ్రగ్ డీలర్లు సమాధుల్లో శవాల దొంగలుగా మారారు. కుష్ డ్రగ్‌కు బానిసలైన అనేక వందల మంది పురుషులు ఫ్రీటౌన్‌లో అవయవ వైఫల్యానికి గురై మరణిస్తున్నారు. మానవ ఎముకలు కలిపిన ఈ బయో డ్రగ్‌లో అధిక మొత్తంలో సల్ఫర్‌ కంటెంట్‌ కారణంగా దీనిని సేవించిన యువతలో ‘జాంబీస్’ మాదిరి అవయవ వైఫల్యం కనిపిస్తుంది. అందువల్ల దీనికి ‘జాంబీ డ్రగ్’ అనే పేరు వచ్చింది. డ్రగ్ డీలర్, బానిసలు, సరఫరాదారులు సమాధులను తవ్వి, ఫ్రీటౌన్ స్మశాన వాటికల నుంచి ఎముకలను వెలికితీస్తున్నారు. కుష్‌ డ్రగ్‌ మితిమీరిన వినియోగం వల్ల వేలాది మంది అవయ వైఫల్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కుష్ డ్రగ్‌ మరణాలకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం అధికారిక గణాంకాలు వెల్లడించలేదు. ముఖ్యంగా 15 నుంచి 25 యేళ్ల వయసున్న పురుషులు కుష్ డ్రగ్‌కు బానిసలవుతున్నారు. అ దేశంలో ప్రజల రోజు సగటు ఆదాయం రూ.400. అయితే రోజుకు రూ.800 వరకు ఈ డ్రగ్‌పై ఖర్చు చేస్తున్నారు. ప్రబలమైన నిరుద్యోగం, కోవిడ్-19 మహమ్మారి వల్ల మరింత దిగజారుతున్న ఆర్థిక సంక్షోభం కారణంగా యువత డ్రగ్స్ బానిసలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హెరాయిన్, కొకైన్‌తో కుష్ డ్రగ్‌ సమానమని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.