AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొటాబయ ఓ మావో.. భారత్‌ పక్కలో మరో బల్లెమేనా ?

ఇండియా పక్కలో మరో బల్లెం రానుందా ? ఓ పక్క పాకిస్తాన్.. ఇంకోపక్క చైనాతో సతమతమవుతున్న నేపథ్యంలో వేరే పక్క నుంచి ఇంకో దేశం పక్కలో బల్లెంగా మారనుందా ? తాజాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స గెలుపొందిన నేపథ్యంలో ఈ రకమైన విశ్లేషణలు ఎక్కువయ్యాయి. తీవ్ర ఉత్కంఠ రేపిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో రాజపక్సకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రాజపక్స […]

గొటాబయ ఓ మావో.. భారత్‌ పక్కలో మరో బల్లెమేనా ?
Rajesh Sharma
|

Updated on: Nov 18, 2019 | 5:08 PM

Share

ఇండియా పక్కలో మరో బల్లెం రానుందా ? ఓ పక్క పాకిస్తాన్.. ఇంకోపక్క చైనాతో సతమతమవుతున్న నేపథ్యంలో వేరే పక్క నుంచి ఇంకో దేశం పక్కలో బల్లెంగా మారనుందా ? తాజాగా శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స గెలుపొందిన నేపథ్యంలో ఈ రకమైన విశ్లేషణలు ఎక్కువయ్యాయి.

తీవ్ర ఉత్కంఠ రేపిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో రాజపక్సకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రాజపక్స గెలిచినట్టు ఎస్ఎల్‌పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి. ఎస్‌ఎల్‌పీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన గొటాబయ రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. శ్రీలంకకు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద్ర రాజపక్స సోదరుడే గొటాబయ రాజపక్స.

అయితే గత 15 ఏళ్లుగా శ్రీలంకలో ఆర్థికాభివృద్ధి మందగించింది. దీనికి తోడు అక్కడ ఈస్టర్ సండే రోజున జరిగిన ఆత్మాహుతి దాడితో పర్యాటక ఆదాయానికి గండిపడింది. ఆత్మాహుతి దాడుల వల్ల రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఇన్ని సమస్యల మధ్య జరిగిన ఎన్నికల్లో గొటాబయ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.

అయితే.. 2008-2009లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో జరిగిన తుది విడత పోరులో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు గొటాబయపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా సింహళీయులు, వారి జాతీయతావాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. శ్రీలంకలో మెజారిటీ కమ్యూనిటీగా ఉన్న సింహళీయుల గొటాబయ రాజపక్సకు జై కొట్టారు. మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలుస్తోంది.

గొటాబయ గెలుపు ఇప్పుడు భారత దేశానికి మరో ముప్పుగా మారుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సహజంగా తమిళులకు తీవ్రమైన వ్యతిరేకిగా ముద్ర పడిన గొటాబయ మరోవైపు చైనాకు అత్యంత ఆప్తుడని తెలుస్తోంది. సిద్దాంత పరంగా మావో అయిన గొటాబయ.. చైనాలోని మావోయిస్టుల ప్రభుత్వానికి ప్రీతిపాత్రుడుగా వ్యవహరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన చైనా అనుకూల విధానాలను అవలంభిస్తే.. ఇప్పటికే శ్రీలంకను దారిలోకి తెచ్చుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం పెంచుకోవడంతో పాటు భారత్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించవచ్చన్న డ్రాగన్ దేశపు కుట్రకు మరింత ఊతమొస్తుందని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

గతంలో శ్రీలంకను మచ్చిక చేసుకునేందుకు చైనా పలు మార్లు ప్రయత్నించింది. కొన్ని సందర్భాలలో శ్రీలంక.. చైనా కనుసన్నల్లోకి వెళ్ళి మరీ వెనక్కి వచ్చిన పరిస్థితిని చూశాం. శ్రీలంక పోర్టులను అభివృద్ధి చేసే బాధ్యతలను చైనా ఇది వరకు స్వీకరించింది. పరోక్షంగా చైనా నేవికి శ్రీలంకను ఓ బేస్‌గా మార్చుకోవాలన్నది చైనా ఎత్తుగడ. ఈ క్రమంలో తమిళులను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా భారత్ వ్యతిరేకిగా ముద్రపడిన గొటాబయ శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికవడం భారతదేశానికి ఇబ్బంది కరమేనంటున్నారు.

ఈ పరిణామాలను ఊహించే గొటాబయ రాజపక్సకు ప్రధాని మోదీ మిత్ర సందేశం ముందుగా పంపినట్లు చెబుతున్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన గొటాబయ రాజపక్సకు మోదీ అభినందనలు తెలిపారు. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మీకు నా అభినందనలు…. ఇరు దేశాలు, పౌరుల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు, ఉభయ దేశాల భద్రత, శాంతి, అభ్యున్నతి కోసం మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.