AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia: 133 మందిని బలిగొన్న ఆ స్టేడియాన్ని పడగొట్టాలని నిర్ణయం.. అది ఫుడ్‌బాల్‌ చరిత్రలో చీకటి రోజు!

ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియం కూల్చివేసి, పూర్తి భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం(అక్టోబర్‌ 17) మీడియాకు తెలిపారు. తాజాగా ఈ స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో దాదాపు 133 మంది..

Indonesia: 133 మందిని బలిగొన్న ఆ స్టేడియాన్ని పడగొట్టాలని నిర్ణయం.. అది ఫుడ్‌బాల్‌ చరిత్రలో చీకటి రోజు!
Indonesia president Joko Widodo and Gianni Infantino
Srilakshmi C
|

Updated on: Oct 19, 2022 | 12:46 PM

Share

ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియం కూల్చివేసి, పూర్తి భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం(అక్టోబర్‌ 18) మీడియాకు తెలిపారు. తాజాగా ఈ స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో దాదాపు 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన జరిగిన రెండు వారాల తర్వాత ఫీఫా హెడ్‌ జియాని ఇన్ఫాంటినో ఇండోనేషియా అధ్యక్షుడిని కలిశారు. దేశంలో ఫుట్‌బాల్‌ ఆటను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఈ సందర్భంగా జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు.

ఫీఫా నుంచి నిపుణులను తీసుకువచ్చి స్టేడియం నిర్మాణంలో ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని, పెట్టుబడులు సైతం పెట్టడానికి వెనకాడమన్నారు. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య, ఇండోనేషియా ఫెడరేషన్‌తో కలిసి పని చేస్తామన్నారు. గ్లోబల్‌ ఫుట్‌బాల్ స్టేజ్‌పై ఇండోనేషియా ప్రకాశించేలా చూస్తామని తెలిపారు. స్టేడియం కార్యకలాపాలు, ప్రకకుల ప్రవర్తనను మెరుగుపరచడం, పాఠశాలల్లో ఫుట్‌బాల్ కార్యక్రమాలను నిర్వహించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. వచ్చే ఏడాది మే- జూన్‌ మధ్యలో స్థానికంగా నిర్వహించే అండర్-20 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ సురక్షితంగా జరిగేలా ఫీఫా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఫీఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం ఉన్న కంజురుహాన్ ఫుడ్‌బాల్‌ స్టేడియం 42,000 మంది సామర్థ్యంతో 2004లో నిర్మించారు. ఈ స్టేడియంలోని గేట్ల ద్వారా లోపలికి ఏకకాలంలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రవేశించేలా చిన్న చిన్నవిగా రూపొందించారు. ప్రమాద సమయంలో కొన్ని గేట్లు తెరవలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండోనేషియాలోనే ఉన్న ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు ఇటీవలి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన ఆరుగురు నిందితుల్లో ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు. మరోవైపు స్టేడియంలోని ప్రధాన లాబీ, పార్కింగ్ ఏరియాలోనున్న సీసీటీవీ ఫుటేజీల్లో మూడు గంటలకు పైగా ఫుటేజీ కనిపించకుండా పోవడం వీరి దర్యాప్తులో బయటపడింది. దీంతో విచారణ పూర్తయ్యే వరకు అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, అన్ని స్టేడియాల భద్రత సమీక్షకు విడోడో ఆదేశించారు.