Telangana: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులసేవలు భేష్! సకాలంలో పలువురు గ్రూప్ 1 అభ్యర్ధులను పరీక్ష కేంద్రాలకు చేర్చిన వైనం
ఆదివారం జరిగిన తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవడానికి పలువురు అభ్యర్ధులు నానా తంటాలు పడ్డారు. పలువురు సకాలంలో చేరలేక కన్నీళ్లతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు కూడా. కొందరు అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు కాకుండా పొరపాటున..
తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16 (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 503 పోస్టులకు గానూ ఈ పరీక్షకు మొత్తం 3 లక్షల 80 వేల మంది దనఖాస్తు చేసుకోగా, 2 లక్షల 86 వేల 51 మంది హాజరయ్యారు. ఐతే పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోవడానికి పలువురు అభ్యర్ధులు నానా తంటాలు పడ్డారు. పలువురు సకాలంలో చేరలేక కన్నీళ్లతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు కూడా. కొందరు అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు కాకుండా పొరపాటున ఇతర పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సకాలంలో వారిని పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. ఈక్రమంలో గ్రూప్ -1 ఎగ్జామ్ కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున కూకట్‌పల్లి ప్రగతి డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్ళింది. పరీక్ష ప్రారంభానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉండటంతో, తన సెంటర్‌కి ఎలా వెళ్ళాలో తోచక ఇబ్బంది పడుతున్న ఆ యువతిని సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీస్ బైక్ రైడర్ కానిస్టేబుల్ వెహికిల్ పై సరైన సమయానికి చైతన్య డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ కు చేర్చారు. దీంతో తనను పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసుకు ఆ యువతి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే కుకట్‌పల్లి ట్రాఫిక్ సిఐ నగేష్ తప్పుడు పరీక్ష కేంద్రానికి పొరపాటున వచ్చిన ఇద్దరు విద్యార్థులను సమయానికి తమ పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు మొబైల్ వాహనంలో ఇద్దరు విద్యార్థులను పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. ఇలా పరీక్ష కేంద్రాలకు సకాలంలో అభ్యర్ధులను చేర్చిన పోలీసుల సహృదయానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.