China Corona: డ్రాగన్ కంట్రీలో మళ్లీ కరోనా విలయం.. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌.. చైనాలో ఏం జరుగుతోంది..

కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు. వివిధ రూపాల్లో విజృంభిస్తూనే ఉంది. చైనాలోని వుహాన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోనే ఉన్నది. ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది.

China Corona: డ్రాగన్ కంట్రీలో మళ్లీ కరోనా విలయం.. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌.. చైనాలో ఏం జరుగుతోంది..
China
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 23, 2022 | 8:59 AM

China Coronavirus: కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు. వివిధ రూపాల్లో విజృంభిస్తూనే ఉంది. చైనాలోని వుహాన్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోనే ఉన్నది. ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా 26 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే చైనాలో 26 వేల 824 కేసులు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఈ సంఖ్య ఏప్రిల్ కంటే అత్యధికమని చైనా అధికారులు తెలిపారు. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌ నుంచి నైరుతిలోని చాంగ్‌కింగ్ వరకు వరుసగా ఆరు రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభించి, ప్రపంచాన్ని స్థంభింపజేసిన తర్వాత ఇపుడిపుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు నామ మాత్రంగా ఉంటున్నాయి. మరణాల భయం తొలగింది. అయితే, మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జీరో కొవిడ్‌ పాలసీలో భాగంగా కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆరు నెలల తర్వాత చైనాలో ఓ కరోనా మరణం సంభవించింది. మూడు రోజుల నుంచి మూడు మరణాలు నమోదు కావడంతో డ్రాగన్ కంట్రి ఉలిక్కి పడింది.

రాజధాని బీజింగ్‌ నగరంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చాయోయాంగ్‌, డోంగ్‌చెంగ్‌, జిచెంగ్‌, టోంగ్‌జౌ, యాస్‌కింగ్‌, చాంగ్‌పింగ్‌, షునీ, హైడియన్‌ జిల్లా ప్రజలను కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అక్కడి అధికారులు కోరారు. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అందరూ విధిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

జీరో కోవిడ్ విధానం అమలులో ఉన్నా..

ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరిస్తున్న జీరో కరోనా విధానం మేరకు మళ్లీ కొత్త ఆంక్షలను అధికారులు ప్రకటించారు. ఆరు నెలల కిందట షాంఘైలో ఒక వ్యక్తి కరోనాతో మరణించగా ఆ నగరంలో రెండు నెలలపాటు లాక్‌డౌన్‌ విధించారు. తాజాగా బీజింగ్‌లో కరోనా మరణం నమోదు కావడంతో ఆ దేశ రాజధాని ప్రజలను లాక్‌డౌన్‌ భయం వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో బీజింగ్‌లోని పార్కులను మూసివేశారు. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు.

ఇవి కూడా చదవండి

చైనాలో ఆరు నెలల తరువాత తొలి కరోనా మరణం నమోదయ్యింది. రాజధాని బీజింగ్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు చనిపోయినట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రకటించింది. దీంతో బీజింగ్‌లో సెమీ లాక్‌డౌన్‌ను అధికారులు విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే కార్యకలాపాలను అన్నింటిని బీజింగ్‌ రద్దు చేసింది. మే 26న షాంఘైకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. తాజా మరణాలతో చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 5వేల 229 మంది మాత్రమే మృతి చెందినట్టు హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో చైనా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నా.. కేసులు మాత్రం కట్టడి కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో ఇప్పటివరకు 2లక్షల 86వేల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.

92 శాతం వ్యాక్సినేషన్..

చైనాలో దాదాపు 92 శాతం జనాభాకు ఇప్పటికే కొవిడ్​ వ్యాక్సినేషన్​ జరిగింది. ఇప్పటికీ చైనాలోని చాలా నగరాల్లో కఠిన లాక్​ డౌన్లు, క్వారంటైన్​ నిబంధనలను అమలు చేస్తున్నారు. కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్న చైనాలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతం మొత్తం ఆంక్షలు విధిస్తూ వస్తోంది. కరోనా లక్షణాలు బయటపడగానే బాధితులను క్వారంటైన్ చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్న చిన్నారులకు అత్యవసర సమయంలో చికిత్స అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులపై తిరగబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జీన్ పింగ్ ప్రభుత్వం కొన్ని చోట్ల ఆంక్షలు విధించి.. మరికొన్ని చోట్ల నిబంధనలు ఎత్తివేయడం వల్లే తరచూ ఇలా జరుగుతుందని పేర్కొంటున్నారు.

ఇళ్లకే పరిమితమైన లక్షలాది ప్రజలు..

కరోనా ఆంక్షల కారణంగా ఝేంగ్‌జువా నగరంలో లక్షలాదిమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్ లక్షణాలు బయటపడితే వారిని నగరానికి దూరంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. కొవిడ్‌ కఠిన ఆంక్షల కారణంగా ఝెంగ్‌జువాలో ఇటీవల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో చైనీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆంక్షలు కొనసాగుతోన్న ప్రాంతాల్లో 3ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిపై ఆంక్షలు సడలించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

Source Link

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..