AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూపాకీ తూటాలు, బాంబుల మోతలతో సహజీవనం.. ఆఫ్గనిస్థాన్‌లో సామాన్యుల జీవన విధానం ఇలా..

Afghan Peoples Life-style: ఒకే ఒక్క గన్‌ షాట్‌ గుండెల్లో దడ పుట్టిస్తుంది.. ఒక్క బాంబు పేలుడు తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తాయి. ఈ శబ్దాలు వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది...

తూపాకీ తూటాలు, బాంబుల మోతలతో సహజీవనం.. ఆఫ్గనిస్థాన్‌లో సామాన్యుల జీవన విధానం ఇలా..
Afghanistan
Janardhan Veluru
|

Updated on: Aug 19, 2021 | 7:55 PM

Share

Afghan Peoples Life-style: ఒకే ఒక్క గన్‌ షాట్‌ గుండెల్లో దడ పుట్టిస్తుంది.. ఒక్క బాంబు పేలుడు తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తాయి. ఈ శబ్దాలు వింటేనే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది… నిత్యం తుపాకీ తూటాలు, బాంబుల వర్షం కురిసే ఆఫ్గనిస్తాన్‌లో సామాన్యుల జీవన స్థితి ఎలా ఉంటుంది..? ఓ వైపు మతఛాందసవాదులు.. మరోవైపు.. విదేశీయుల ఆక్రమణలు.. ఇవి చాలవన్నట్లు ఇంకోవైపు తెగల కుమ్ములాటలు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యే  ఆఫ్గన్‌లో ప్రజలు ఎలా జీవిస్తారు..? ఆఫ్గన్‌లో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదవేయండి.

ఆకాశం దద్దరిల్లే బాంబుల మోతలు..నెత్తుటి ఏరులు పారించే విచక్షణా రహిత కాల్పులు.. ఛిద్రమైన మహిళల చీకటి రోదనలు..పసివారి కన్నుల్లో భయోత్పాతాన్ని సృష్టించే నిత్యకృత్య యుద్ధవాతావరణం.. ఆఫ్గనిస్తాన్‌ అంటే.. ప్రపంచానికి గుర్తొచ్చేది ఇదే..! ఎప్పుడేం జరుగుతుందో.. ఏ రాకెట్‌ లాంచర్‌ వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితులు.. నిత్యం భయాందోళనల మధ్య బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు ఆఫ్గన్‌ పౌరులు.. కానీ.. ఈ బాంబుల మోతలు, కాల్పుల శబ్ధాల వెనుక.. మరో కోణం ఉంది.. ఈ యుద్ధ భూమి వెనుక అఫ్ఘన్‌ ప్రజల అందమైన, అతిపురాతనమైన సుందర జీవన శైలి అల్లుకొని ఉంది..

వివిధ ప్రాచీన సంస్కృతుల మేళవింపు ఆఫ్గనిస్తాన్‌. అన్నిదేశాల్లానే.. ఇక్కడ కూడా ఎన్నో తెగలు, మరెన్నో జీవన విధానాలతో ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నారు ఆఫ్గానీయులు.  అయితే 70వ దశకం నుంచి అఫ్గన్‌ ప్రజల జీవితాల్లో కల్లోలం ప్రారంభమయ్యింది. తీవ్రమైన అంతర్యుద్ధాలూ, తీవ్రవాద కార్యకలాపాలు, విదేశీ దాడులు, అనాదిగా జాతుల పోరాటాల కారణంగా.. ఇక్కడ నిత్య సంఘర్షణ వాతావరణం ప్రజలకు సర్వసాధారణంగా మారింది.

Afghanistan

Afghanistan

ఆఫ్గన్‌ జనాభాలో 99.7 శాతం మంది ముస్లింలే ఉన్నారు. అందులో 84.7 శాతం సున్నిలు కాగా, 7 నుంచి 15 శాతం షియాలు ఉన్నారు. ఒక్క శాతం మాత్రమే ఇతర మతస్తులు ఉన్నారు. ఇక్కడ పాలనకూ, చట్టాలకూ ఇస్లాం మత గ్రంధాలే మూలం. పురుషులు లూజుగా ఉండే లాల్చీ పైజమా ధరిస్తారు. షరియా చట్టం మేరకు అక్కడ పురుషులకు పొడవాటి గడ్డం తప్పనిసరి చేసింది తాలిబన్‌ రాజ్యం. ఇక మహిళలు నిండైన సాంప్రదాయక వస్త్రాలు ధరిస్తారు. మొదట వ్యక్తిగత ఇష్టంగా ప్రారంభమైన బురఖా.. తర్వాత తాలిబన్లతో స్త్రీల జీవితాలను చీకటి గుహల్లోకి నెట్టింది. మత ఛాందసవాదుల ఇష్టారాజ్యంగా నడిచే అఫ్గన్‌లో ఆడపిల్లల విద్యను తాలిబన్లు నేరపూరితంగా మార్చారు. ఆడవాళ్ళ స్వేచ్ఛను పూర్తిగా హరించి వేశారు. ఇక్కడి బాలలకు అందమైన బాల్యం ఓ సుదూర స్వప్నంగా మారింది.

అత్యధిక భూభాగం ఎత్తైన పర్వతాలూ, పెద్ద మైదానాలతో నిండివుండే అఫ్గనిస్తాన్‌లో అపారమైన ఖనిజ నిక్షేపాలూ, చమురు నిల్వలూ, విలువైన రత్నాల గనులూ ఉన్నాయి. అత్యధిక మంది వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవిస్తారు. ఉమ్మడి జీవితానికీ, సమైక్యానందానికీ ఆఫ్గనిస్తాన్‌ ప్రజలు అత్యంత విలువిస్తారు. పెళ్ళైనా, పండగైనా హంగూ ఆర్భాటాలకంటే ఐక్యంగా జరుపుకునే చిన్ని చిన్ని ఆనందాలకే ప్రాధాన్యం ఇస్తారు. భౌగోళిక కారణాలు, వారసత్వంగా వచ్చిన అందచందాలు వారికి పెట్టని కిరీటం. ఇక పెళ్లిళ్ళలోనూ, ఇతర సందర్భాల్లోనూ సంగీతం వారి జీవన విధానంలో భాగంగా ఉంటుంది. అఫ్గనిస్తాన్‌ సమాజంలో పెళ్ళికి, కుటుంబాలకూ విలువ ఎక్కువ. ఒంటరి వ్యక్తుల హక్కులకు పెద్దగా ప్రాముఖ్యతనివ్వరు. వరకట్నం, బహుభార్యాత్వం ఇక్కడ సర్వసాధారణం.

Afghan Women

Afghan Women

అఫ్గన్‌ క్రీడల్లో బుజ్కిషి… వీరి ప్రాచీన జాతీయ క్రీడ. ఇది పోలో మాదిరి ఆట. గుర్రాల మీద వెళుతూ బంతికి బదులుగా మేక మృతదేహాన్ని వాడతారు. తదనంతర కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఫుట్‌బాల్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 2007లో అఫ్గనిస్తాన్‌ వుమన్స్‌ నేషన్‌ ఫుట్‌బాల్‌ టీం ఏర్పాటయ్యింది. కైట్‌ ఫైటింగ్‌ ఇక్కడ ప్రాచుర్యం పొందిన పిల్లల సాంప్రదాయ క్రీడ. ఇక ఆఫ్గన్‌లో అక్షరాస్యత తక్కువైనప్పటికీ.. వీరి సంస్కృతిలో సంప్రదాయ పర్షియా కవిత్వం కీలకమైంది. తాలిబన్ల కాలానికి ముందు.. కాబూల్‌ ముఖ్యమైన సంగీత స్థావరంగా ఉండేది.

గోధుమలు, జొన్న, బార్లీ, ప్రధాన పంటలుగా ఉండే అఫ్గనిస్తాన్‌లో ఆహారపుటలవాట్లలో సైతం గోధుమలదే అగ్రభాగం. పాకిస్తానీయులు ఇష్టపడే ఘాటైన వంటకాలు పెద్దగా ఇష్టపడరు. తాజా డ్రైఫ్రూట్స్‌ వారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటారు. దానిమ్మ, ద్రాక్ష, అతిపెద్దవైన పుచ్చకాయలు పండిస్తారు. ఆహారంలో తీసుకుంటారు.

ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న విధ్వంసకరం దృశ్యాలు చూసి.. ఇక్కడ సున్నితత్వానికి చోటే లేదని అందరూ అనుకుంటారు. కానీ అఫ్గన్‌ ప్రజలు పక్షి ప్రేమికులు. వీరికి జంతువుల పట్ల అమితమైన ప్రేమ, వాత్సల్యం ఉంటుంది. అందుకే వీరిజీవితంలో పక్షలు ఒక ముఖ్యమైన భాగంగా మారాయి.

Afghanistan

Afghanistan

సాంప్రదాయం పేరుతో అణచివేతని ఎవరైనా… ఎంతోకాలం సహించలేరనడానికి.. ఇక్కడి స్త్రీలే ఉదాహరణ..! అఫ్గనిస్తాన్‌లో సుదీర్ఘ పోరాటం అనంతరం.. స్త్రీల హక్కుల్లో కొన్నిటిని సాధించుకున్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను సొంతం చేసుకున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలూ వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశాయి. ఆడవాళ్ళూ మనుషులేనన్న భావనకు అంకురార్పణ జరిగింది.

మతఛాందస వాదుల సంకెళ్లు తెంచుకొని.. స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ.. అభివృద్ధి కలలతో ముందుకు సాగుతున్న ఆఫ్గన్‌ పౌరుల్లో.. మళ్లీ ఇప్పడు భయాందోళనలు మొదలయ్యాయి. తాలిబన్ల రాకతో వారు సాధించుకున్న హక్కుల హరణ తప్పదన్న భయం స్త్రీల్లో నెలకొంది. మళ్ళీ మహిళల జీవితాల్లో గాఢాంధకారం అలుముకుంటోంది. ఇక్కడి స్త్రీలకీ, పిల్లలకీ అలనాటి ఆనందాలు అందని ద్రాక్షేనా అని ఆవేదన వ్యక్తమవుతోంది.

Also Read..

Schemes for Farmers: ఈ పథకాలతో రైతులకు ఎంతో మేలు.. అస్సలు మిస్ అవ్వకండి… పూర్తి వివరాలు

Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?