- Telugu News Photo Gallery Central Government top five best schemes for farmers including e nam portal pm kisan yojana
Schemes for Farmers: ఈ పథకాలతో రైతులకు ఎంతో మేలు.. అస్సలు మిస్ అవ్వకండి… పూర్తి వివరాలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. వ్యసాయానికి సంబంధించి రైతులకు సమాచారం అందించడానికి, ప్రభుత్వ సహాయం అందించడానికి, పంటల దిగుబడిని పెంచడానికి వివిధ కార్యక్రమాలు, పథకాలకు రూపకల్పన చేస్తోంది.
Updated on: Aug 19, 2021 | 7:40 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో ఇది ఒకటి. ఈ పథకం కింద 2 హెక్టార్ల (4.9 ఎకరాలు) కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద, రైతులందరూ కనీస ఆదాయ మద్దతుగా సంవత్సరానికి 6 వేల రూపాయలు పొందుతున్నారు. 2018, డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనిని రైతులకు ఒక వరంగా పేర్కొంటున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలు.. మూడు వాయిదాలలో చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.

డీబీటీ పోర్టల్, డీబీటీ కృషి యంత్ర యోజన పథకాలను భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలోని రైతులు వ్యవసాయ యంత్రాలను తక్కువ ధరలకే పొందవచ్చు. ఈ పథకం కింద రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. వ్యవసాయ యంత్రాలపై భారీ ఎత్తున రాయితీలు ఇస్తుంది. ఈ పథకంలోనూ రైతుల ఖాతాకు నేరుగా డబ్బులు బదిలీ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతుల సబ్సిడీ ఏ మధ్యవర్తికి చేరకుండా నేరుగా వారికే ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపిస్తోంది.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) అనేది పాన్-ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. ఇది వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని రైతులు తమ పంటలను ఎక్కడైనా విక్రయించవచ్చు. ఇందులో మొత్తం ఆన్‌లైన్ విధానమే ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్‌లోనే జరుగుతాయి. ఉత్తరప్రదేశ్ (66), మధ్యప్రదేశ్ (58), హర్యానా (54), మహారాష్ట్ర (54), తెలంగాణ (44), గుజరాత్ (40) చొప్పున ఈ ఆరు రాష్ట్రాలు ఇ-నామ్ కింద అత్యధిక సంఖ్యలో మార్కెట్లు కలిగి ఉన్నాయి.

వేప పూత యూరియాను రైతులకు అందిస్తున్నారు. ఈ యూరియా వల్ల పంటల అవసరానికి అనుగుణంగా నత్రజని పోషకాలు లభ్యమవుతాయి. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఎరువులను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. 2015, జనవరి 7న భారత ప్రభుత్వం 100% వేప పూతతో కూడిన యూరియాను ఉత్పత్తి చేయడానికి ఎరువుల కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. గతంలో, వేప పూతతో తయారు చేసిన యూరియాను ఎరువుల కర్మాగారం మొత్తం సామర్థ్యంలో 35 శాతం వరకు మాత్రమే అనుమతించేవారు.

ఎరువుల వాడకం వలన నేలలో పోషక లోపం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నేలలోని పోషకాల లోపాన్ని గుర్తించే లక్ష్యంతో 2014-15 సంవత్సరంలో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద.. రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకం అమలు మొదటి దశలో అంటే 2015 నుండి 2017 సంవత్సర వరకు 10.74 కోట్ల కార్డులు జారీ చేశారు. ఆ తరువాత రెండో దశలో 2017-2019 సంవత్సరం వరకు 11.69 కోట్ల కార్డులు పంపిణీ చేశారు.




