వరకట్నం కోసం భార్యను చంపాడని భర్తపై కేసు! రెండేళ్ల తర్వాత బతికొచ్చిన భార్య
ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వివాహిత మధ్యప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. అదృశ్యం వెనుక వరకట్న వేధింపుల ఆరోపణలతో ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదై, జైలు జీవితం కూడా గడిపారు. ఇప్పుడు ఆమె తిరిగి రావడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

పెళ్లి అయిన ఏడాదిన్నర తర్వాత ఓ మహిళ తన అత్తారింటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టి, ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో.. ఆమె భర్త, అత్తమామలపై అనుమానంతో.. వాళ్లే వరకట్నం కోసం ఆమె చంపి ఉంటారని, మహిళ తల్లిదండ్రులు వారిపై కేసు పెట్టారు. ఈ కేసు రెండేళ్ల క్రితం నమోదైంది. దాంతో పాపం ఆ భర్త, అతని తల్లిదండ్రులు రెండేళ్లుగా పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. తీరా ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఇంటికి తిరిగి వచ్చింది.
ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల ఓ యువతి 2023లో తన అంత్తారింటి నుంచి అదృశ్యమైంది. కొంతకాలంగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుటుంబం ఆ సంవత్సరం అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్తృతంగా గాలింపులు జరిపినా ఆమె జాడ కనిపించకపోవడంతో, ఆమె కుటుంబం వరకట్నం కోసం ఆమెను చంపారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమె భర్త, అత్తమామలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304B (కట్నం మరణం) కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు రెండేళ్ల పాటు కొనసాగుతుండగా ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, నిఘా బృందాలు ఆమెను మధ్యప్రదేశ్‌లో గుర్తించాయి. ఆమెను అక్టోబర్ 1న తిరిగి ఔరయ్యకు తీసుకువచ్చారు. ఆ మహిళ మధ్యప్రదేశ్‌లో ఏం చేస్తుందో, ఇంత కాలం ఆమె కుటుంబంతో లేదా అత్తమామలతో ఎందుకు దూరంగా ఉందో అని దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
