Train: 8 ఇంజిన్లు.. 682 బోగీలు.. 5648 చక్రాలు.. ప్రపంచంలోనే పొడవైన రైలు గురించి తెలుసా..?
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైల్లోనే. తక్కువ ధర, ఎక్కడికైన వెళ్లగలిగేలా ఉండడమే దీనికి కారణం. ఇటీవలే రైల్వే శాఖ రుద్రాస్త అనే అతి పొడవైన రైలు నడిపి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రపంచంలో అతిపొడవైన రైలు ఏ దేశంలో ఉందో తెలుసా..?

భారతీయ రైల్వే ఇటీవల దేశ చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలును పట్టాలపై నడిపి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ భారీ రైలు పేరు “రుద్రాస్త్ర”. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు. ఈ రైలులో మొత్తం 354 వ్యాగన్లు ఉన్నాయి. వీటిని లాగడానికి 7 శక్తివంతమైన ఇంజిన్లను ఉపయోగించారు. రుద్రాస్త్ర రైలు గంజ్ఖ్వాజా స్టేషన్ నుండి బయలుదేరి.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్హ్వా రోడ్ వరకు కేవలం 5 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశానికి ఒక రికార్డు అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మాత్రం ఆస్ట్రేలియాలో నడుస్తోంది.
ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్
ప్రపంచ గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న ఈ గూడ్స్ రైలు పేరు ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్. ఇది కూడా సరుకు రవాణా కోసం మాత్రమే నడుస్తుంది. దీని పొడవు 7.3 కిలోమీటర్లు. అంటే సుమారు 22 ఈఫిల్ టవర్లు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఉండే పొడవుకు సమానం. ఈ రైలులో 682 కోచ్‌లు, 5,648 చక్రాలు ఉన్నాయి. దీనిని కదిలించడానికి 8 భారీ ఇంజిన్లను ఉపయోగిస్తారు. ఇది కేవలం పొడవులోనే కాదు, బరువులో కూడా రికార్డు సృష్టించింది. దీని మొత్తం బరువు లక్ష టన్నులకుపైగా ఉంటుంది.
ఈ రైలును ప్రధానంగా ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఒకే ప్రయాణంలో ఇది దాదాపు 99,734 టన్నుల ఇనుప ఖనిజాన్ని తీసుకువెళుతుంది. 2001 జూన్ 21న తొలిసారిగా ప్రయాణించిన ఈ రైలు, ఆస్ట్రేలియాలోని యాండీ మైన్ నుండి పోర్ట్ హెడ్‌ల్యాండ్ వరకు 275 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలులో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దాని ఆధునిక నియంత్రణ వ్యవస్థ. రైలు పొడవునా ముందు నుండి చివర వరకు ఇంజిన్లు దాదాపు ఒక కిలోమీటరు దూరంలో వేరుగా అమర్చబడి ఉంటాయి. అయినప్పటికీ ముందు ఉన్న ఒకే ఒక్క లోకో పైలట్ మిగిలిన అన్ని ఇంజిన్లను ఒకేసారి నియంత్రించగలడు. ఇది ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం.
భారత్ రుద్రాస్త్రతో ఒక కొత్త అధ్యాయం సృష్టించగా, ఆస్ట్రేలియా రైలు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ రెండు రైళ్లు సరుకు రవాణాలో సమర్థత, సాంకేతికత ఎంత ముఖ్యమో నిరూపిస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
