యమ డేంజర్.. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 15లక్షల మంది ‘ఊపిరి’ ఆగిపోతుంది..!
ఏటా 15లక్షల మంది భారతీయులు చనిపోతున్నారు. ప్రాణాలు కోల్పోవడం అంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద సమస్య. ఎందుకో తెలుసా..? ఎలాగో తెలుసా..? అకారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. తామెందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిల్లో భారతీయ ప్రజానీకం బతుకుతోంది. కారణం, బీపీకి మించిన రిస్క్ ఫ్యాక్టర్ మనల్నీ పట్టిపీడిస్తోంది. అదేంటో తెలుసా..?

ఏటా భారతదేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 15లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేమీ నోటి లెక్కలు కాదు. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో చెప్పే వాస్తవ సూచీలు. ఎగ్జాంపుల్ ఢిల్లీనే తీసుకోండి. అక్కడ ఊపిరితిత్తుల నిండా ఊపిరి తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి. ఢిల్లీలో గాలి నాణ్యత-AQI మంగళవారం (డిసెంబర్ 16, 2025) 380 పాయింట్లు నమోదైంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీ. మార్జినల్ ఇంప్రూవ్‌మెంట్” GRAP-4 అమలు చేసిన తర్వాత కూడా ఈస్థాయిలో గాలి నాణ్యత పడిపోవడం ఢిల్లీ వాసులను మరింత కలవరపెడుతోంది. ఆదివారం (డిసెంబర్ 14, 2025) కొన్ని మానిటరింగ్ స్టేషన్లలో 450 కంటే ఎక్కువగా నమోదవగా, శనివారం 430, సోమవారం 449 వరకు పెరిగింది. AQI 301-400 మధ్య ‘వెరీ పూర్’ కేటగిరీ కాగా 401-500 మధ్య ‘సీవియర్’గా ఉంటుంది.
2024లో ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం ఎయిర్ పొల్యూషన్ వల్ల భారత్‌లో ఏటా సుమారు 1.5 మిలియన్ మంది చనిపోతున్నారు. 2025లో University of Chicago , Air Quality Life Index నివేదికలో భారత ప్రజలు సగటు జీవితకాలం 3.5 సంవత్సరాలు తగ్గతూ వస్తోంది. దేశంలో 46% మంది జనం PM 2.5 ప్రమాణాలను మించి ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ నోయిడా ప్రాంతమైతే అత్యంత ప్రమాదకరంగా మారింది. అక్కడి ప్రజలు సుమారు ఐదేళ్ల జీవనకాలాన్ని కోల్పోతున్నారని నివేదిక తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHO గాలి నాణ్యత 5 మైక్రో గ్రాంఫర్ క్యూబిక్ మీటర్‌గా సెట్ చేసింది. ఇలా తక్కువ కాలుష్య ప్రాంతాల్లో సగటు జీవితకాలం సుమారు 9 నెలలు పెరుగుతుంది. WHO ప్రమాణాలతో, ఢిల్లీ-ఎన్‌సీఆర్ నివాసితుల జీవితకాలం సుమారు 8.2 సంవత్సరాలు కోల్పోతున్నారు. పైగా మన దగ్గర వాయు కాలుష్యం ద్వారా చనిపోతున్నవారి మరణాలు నమోదు స్పష్టంగా లేదు. దీనికి కారణం వ్యవస్థాపక పద్ధతులు లేకపోవడం.
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం రెండవ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉంది. బీపీ తర్వాత వాయు కాలుష్యమే మనుషుల ఆయుష్షును సగానికి తగ్గించేస్తోందంటున్నారు నిపుణులు. State of Global Air-2025 నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా 7.9 మిలియన్ మంది వాయు కాలుష్యంతోనే మరణించారు. అంటే ఎనిమిది మందిలో ఒక్కరు వాయు కాలుష్యంతోనే ప్రాణాలు వదులుతున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ హాస్పిటల్‌లలో ఊపిరితిత్తుల సమస్యలతో, కంటి ఇర్రిటేషన్‌తో వచ్చిన రోగుల సంఖ్య పెరిగింది. దేశ రాజధాని గ్యాస్ చాంబర్ గా మారింది. ఎయిర్ ప్యూరిఫైర్లు తాత్కాలికంగా సమస్యను తగ్గించినా, దీర్ఘకాలికంగా వాయు కాలుష్యం నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో బయట తిరగకుండా ఉంటేనే మంచిదని, అత్యవసరమైతే N95 మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
కేవలం గాలి కాలుష్యంతోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం అంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అతిపెద్ద సమస్య. చిన్నపిల్లలు, వృద్ధులు, హృద్రోగులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిపై అత్యధిక ప్రభావం ఉంటుంది. ఇది కేవలం సీజనల్ సమస్యే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్య, ఆర్థిక సామాజిక సవాల్. ప్రజలు- ప్రభుత్వం కలిసి కాలుష్య నియంత్రణకు పనిచేయకుంటే ఢిల్లీ‑ఎన్‌సీఆర్ భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




