Telangana: ఆ ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్ ఎస్ నాయకుడు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకోవడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో సమస్యలపై మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలను..
తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకోవడంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో సమస్యలపై మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాల నాయకులపై కూడా వైఎస్.షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన షర్మిల తాజాగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ను టార్గెట్ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ఆమె మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజల చెవిలో కేసీఆర్ గత కొన్నేళ్లుగా పూలు పెడితే.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టారంటూ విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రఘునందనరావు విఫలమయ్యారన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. 11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగిందని తానను ఎమ్మెల్యేగా గెలిపిస్తే న్యాయం చేస్తానని చెప్పిన రఘునందనరావు ఏమి న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. రెండింతల పరిహారం ఇప్పిస్తానని చెప్పి, గెలిచిన తర్వాత ఆ హామీని మర్చిపోయారంటూ ఆరోపించారు వైఎస్.షర్మిల. పరిహారం ఇప్పించక పోతే 6 నెలల్లో రాజీనామా చేస్తానని చెప్పిన రఘునందనరావు పరిహారం ఇప్పటివరకు ఇప్పించలేదని, రాజీనామా కూడా చేయలేదని అన్నారు. ప్రతి రైతుకు కాడేద్దులు ఇప్పిస్తా అని ఇచ్చిన హామీ ఏమయ్యింది.. ఒక్కరికైనా కాడెద్దులు ఇచ్చారా అని షర్మిల ప్రశ్నించారు.
బీజేపీ నాయకుడు కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెస్తా అన్నారు. దుబ్బాక కి ట్రైన్ అన్నారు.. పరిశ్రమలు తీసుకొస్తానని ఎన్నో హామీలు ఇచ్చారు. ట్రైన్ వచ్చిందా… పరిశ్రమలు వచ్చాయా.. ఎమ్మెల్యే రఘునందనరావు సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి పై కేసీఅర్ మెడలు వంచుతామని చెప్పి యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకున్నారు. వంచిండా.. ఈ సమస్యపై కనీసం ఏ రోజైనా కొట్లాడరా అంటూ రఘునందన్ పై వైఎస్.షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తే… ఈ దుబ్బాక కి కనీసం 10 వేల ఉద్యోగాలు అయినా తెచ్చారా అని అడిగారు. ఎన్నికల్లో దుబ్బాక లో కుటుంబ సభ్యులతో ఆసుపత్రి కడతామని, కార్పోరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రఘునందనరావు హామీ ఇచ్చారు. అయితే ఆస్పత్రి కట్టారు దుబ్బాకలో కాదు.. అమీర్ పేటలో.. అక్కడ దోచుకోవడమేనట అంటూ ఎద్దెవా చేశారు వైఎస్.షర్మిల.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు బీజేపీలో ఉన్నట్లా.. టీఆర్ ఎస్ లో ఉన్నట్లా.. బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్ ఎస్ నాయకుడు రఘునందనరావు అంటూ షర్మిల విమర్శించారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచామనే కనీస జ్ఞానం కూడా ఎమ్మెల్యే రఘునందనరావుకు లేదన్నారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి గురించి ఎమ్మెల్యే రఘునందనరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంట.. పావురాల గుట్టలో పావురంలా కలిసి పోయాడని అన్నారంట.. ఈ ఎమ్మెల్యేకి ఇదే చెప్తున్నా.. వైఎస్.రాజశేఖర్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదు. వార్నింగ్ కూడా ఇస్తున్నా అంటూ వైఎస్.షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పెట్టిన పథకాలతో లబ్ధిపొందిన వాళ్లు కోట్ల మంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ఆ మహానేత గురించి మాట్లాడితే వైఎస్సార్ అభిమానులు ఊరుకోరంటూ షర్మిల చెప్పారు.
ఇటీవల కాలంలో వైఎస్.షర్మిల టీఆర్ ఎస్ పార్టీతో పాటు.. వివిధ పార్టీల నాయకులను టార్గెట్ గా అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు అవతలి నాయకుల నుంచి కూడా కౌంటర్ వస్తుండటంతో ఒక్కోసారి షర్మిల వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..