Cyber Crime: పండగపూట కేటుగాళ్ల వల.. బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్ సృష్టి.. క్లిక్ చేశారో ఖాతా ఖాళీ..!
మీకు కారు కావాలా.. దాని వాల్యూకి సరిపడా డబ్బు కావాలా అనే ఆఫర్‌కి టెమ్ట్ అయ్యారో సైబర్ వలలో చిక్కుకున్నట్టే.. లక్కీ డ్రా తగిలిందంటూ వచ్చిన మెసేజ్‌కు..
మీకు కారు కావాలా.. దాని వాల్యూకి సరిపడా డబ్బు కావాలా అనే ఆఫర్‌కి టెమ్ట్ అయ్యారో సైబర్ వలలో చిక్కుకున్నట్టే.. లక్కీ డ్రా తగిలిందంటూ వచ్చిన మెసేజ్‌కు.. రిప్లై ఇచ్చారో మీ అకౌంట్ ఖాళీ అయినట్టే. షాపింగ్ చేసినందుకు కూపన్ వచ్చిందని ఫోన్ చేస్తే.. మీ వివరాలు చెప్పారో జేబుకు చిల్లుపడినట్టే.. అడ్డంగా తినమరిగిన సైబర్ నేరగాళ్లు.. అనేక దారులను వెతుక్కుంటున్నారు. రోజుకో విధంగా.. పూటకో ప్లాన్ వేసి మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సరికొత్త ఉపాయంతో సమాజంలోకి చొరబడుతున్నారు సైబర్ బూచోళ్లు.
పండగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ డిజిటల్‌లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్‌ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది.
అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ వచ్చింది. ఇప్పటి వరకు మెసేజ్‌ల ద్వారా బురిటీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా వైరస్‌లను సృష్టించి జనాల ఫోన్లలోకి వదులుతున్నారు. సోవా పేరుతో ఒక వైరస్ మొబైల్ ఫోన్లలోకి జొరబడుతోంది. క్షణాల్లో మీ ఫోన్ హాక్ అవుతుంది. డాటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు యాప్‌ల ద్వారా వీలవుతుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారుల ప్రయోజనం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అవగాహనతో వీటిని వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, మోసగాళ్లు ఈ బ్యాంకింగ్ యాప్‌లను పోలినట్లుగానే మరో నకిలీ యాప్‌లను సృష్టిస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు సోవా మొబైల్ బ్యాంకింగ్ మాల్‌వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తున్నారు. అందులో ఉన్న పొరపాటున క్లిక్ చేస్తే చాలు. ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక ఫోన్ మీ చేతిలోనే ఉన్నా దానిలో సమాచారం అంతా వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. క్షణాల్లో ఖాతా ఖాళీ అవుతుంది.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సోవా వైరస్ విషయంలో బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో పాటు పలు బ్యాంకులు ఈ విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి.
సోవా మాల్‌వేర్ ఫోన్లలో చేరి, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు, నెట్- బ్యాంకింగ్ యాప్‌లను వాడినపుడు పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్‌లో చేరితే..దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం నిపుణులంటున్నారు. ఈ వైరస్ ఎక్కువగా మెసేజ్‌ల రూపంలోనే వస్తోంది. ఒక్కసారి ఫోన్‌లో చేరాక.. అందులో ఉన్న యాప్‌ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకొని, మాల్‌వేర్‌ను పంపించి ఖాతా ఖాళీ చేస్తున్నారు.
క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అక్టోబర్ 1 నుంచి టోకనైజేషన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సోవా వైరస్ ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వివరాలనూ తస్కరించేంత శక్తిమంతంగా ఉందని బ్యాంకింగ్ సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకంగా 200 రకాలకు పైగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతోపాటు, క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని చెబుతున్నారు.
సోవా వైరస్ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంకులు సూచిస్తున్నాయి. ఆఫీషియల్ యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. యాప్ ఉపయోగించుకునేందుకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని అందించాలంటున్నారు.
యాప్‌లు ఇస్తున్న అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే వెబ్‌సైట్ లింకులను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు బ్యాంకులకు సంబంధించిన టెక్నికల్ నిపుణులు. సో.. చూశారు కదా మెసేజ్ వచ్చింది కదా అని ఏది పడితే అది క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ కావడం గ్యారంటీ.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..