CM Revanth: సీఎం ఢిల్లీ పర్యటనలతో నేతల్లో ఆశలు.. నామినేటెడ్ మాదిరే పార్టీ పదవులకు డిమాండ్!
అగ్రనేతల ఢిల్లీ పర్యటనలు చూసి.. వాళ్లంతా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ పండక్కి పదవుల దావత్ చేసుకుందామని ఎంతో ఆశపడ్డారు. ఇగ టైగర్‌కి టైమొచ్చిందని అనుచరుల దగ్గర గప్పాలు కొట్టారు. ఇప్పుడేమో అసలు విషయం తెలిసి.. యే రాలే.. టైగర్‌కు టైం రాలే..
అగ్రనేతల ఢిల్లీ పర్యటనలు చూసి.. వాళ్లంతా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ పండక్కి పదవుల దావత్ చేసుకుందామని ఎంతో ఆశపడ్డారు. ఇగ టైగర్‌కి టైమొచ్చిందని అనుచరుల దగ్గర గప్పాలు కొట్టారు. ఇప్పుడేమో అసలు విషయం తెలిసి.. యే రాలే.. టైగర్‌కు టైం రాలే.. అని సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారట. దసరా ఎలాగూ లేదు.. దీపావళికైనా ధమాకా పేలుతుందా? లేదా? అని ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఇదంతా ఏంటసలు అనుకుంటున్నారా? దెన్ హ్యావ్ ఏ లుక్.
పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో… నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీగా ఎగబడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు సేమ్ టు సేమ్… పార్టీ పదవుల కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు దక్కనివారు కనీసం అధికార పార్టీలో ఏదో ఒక పదవి దక్కకపోదా? అని ఎదురుచూస్తున్నారట. కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు, రేపు అంటూ… ఊరిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.. దసరా పండగ సందర్భంగా ఆ పందేరాన్ని పూర్తి చేయాలని భావించింది. దీంతో ఈ పండక్కి పదవులు దక్కించుకుని.. ఫుల్ దావత్ చేసుకుందామనుకున్నారు నేతలు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. ఈ దసరాలోపు పదవులు పక్కా అనే విశ్వాసం నాయకుల్లో మరింత పెరిగింది. దసరాకు పదవుల దమాకా.. అంటూ భారీగా ప్రచారం కూడా జరిగింది. పీసీసీ కార్యవర్గంతో పాటు, మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా జరిగిపోతుందంటూ.. గాంధీభవన్ సర్కిల్‌లో విస్తృత చర్చే జరిగింది. అయితే, నేతలు పెంచుకున్న ఆశలపై… నీళ్లు చల్లినట్టుగా సరికొత్త ముచ్చట తాజాగా వెలుగులోకి వచ్చింది. పండగలోపు పదవుల పందేరం ఉండేలా లేదని పార్గీవర్గాలు చెబుతున్నాయి. ఆలోపే పూర్తవుతుందనుకున్నా.. ఆ అవకాశం కనిపించట్లేదట. అలా ప్రకటన రాగానే.. ఇలా పదవీ బాధ్యతలు చేపట్టి, దసరాకు మరో దసరాను జోడించి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న నేతలు.. తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారట.
పార్టీ ముఖ్యలు ఢిల్లీ వెళ్లి… పిసిసి కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ విస్తరణ సహా కీలక అంశాలపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. దీంతో వెరీ సూన్… పదవుల జాతర పక్కాగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ వెళ్లి ఖర్గే సహా అగ్రనేతలతో సమావేశమైన రేవంత్… పార్టీ పదవులపై ఎలాంటి చర్చా జరపలేదని తెలుస్తోంది. ఆ అవకాశం కూడా రాలేదట. ఎందుకంటే, జమ్ము కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలపై పార్టీ పోస్టుమార్టం చేస్తోందట. దీంతో, తెలంగాణలో పదవుల పంపకం అంశాన్ని, ఇప్పటికి పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
దసరాలోపు పక్కాగా ఏదో ఒక పదవి పక్కాగా తమను వరిస్తుందని ఆశపడిన చాలా నేతలు… కనీసం పండగ తర్వాతనైనా ప్రకటన ఉంటుందా లేదా అనే మీమాంసలో పడ్డారట. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 నెలలవుతున్నా… కష్టపడ్డ తమను గుర్తించడం లేదని వాపోతున్నారట. కనీసం దీపావళికైనా తమ కళ్లలో ఆనందపు వెలుగులు నింపేలా… పదవుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారట. ఆలస్యం చేస్తే.. నేతలు, వాళ్లను నమ్ముకున్న క్యాడరూ.. నిరుత్సాహం చెందే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే నేతలందరూ పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి, హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందన్నదే తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..