AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నదానం చేస్తే మీ తలరాత మారినట్లే.. ఎంత పుణ్యమంటే..?

అన్నదానం అన్ని దానాలలోకెల్లా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవద్గీత, ఆదిశంకరాచార్యుల కనకధారా స్తవం వంటి అనేక ఉదాహరణలు దీని ప్రాముఖ్యతను తెలుపుతాయి. అన్నదానం చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఐశ్వర్యవంతులుగా పునర్జన్మ పొందుతారని, గత జన్మ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని మన పురాతన సంప్రదాయం నమ్ముతుంది.

అన్నదానం చేస్తే మీ తలరాత మారినట్లే.. ఎంత పుణ్యమంటే..?
Annadanam
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2026 | 2:58 PM

Share

అన్నదానం వలన కలిగే ప్రయోజనాలు అపారమైనవి. మన భారతీయ సనాతన సంస్కృతిలో అన్నదానానికి అగ్రస్థానం ఉంది. సాక్షాత్తు భగవద్గీతలో పరమాత్మ “అన్నాద్భవంతీ భూతాని పర్జన్యాదన్నసంభవః” అని చెప్పినట్లు, ఆహారం నుంచే సమస్త జంతుజాలం పుడుతుంది. కాబట్టి, అన్నం సకల జీవరాశికి మూలం. అన్నదానం చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని ఆచరించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అన్నదానం చేసినప్పుడు, ఆహారం స్వీకరించినవారు “అన్నదాత సుఖీభవ” అని ఆశీర్వదిస్తారు. భోజనం చేసిన తర్వాత కాళ్లు కడుక్కున్నప్పుడు పారిన నీరు, అన్నదాత చేసిన పుణ్యకార్యానికి వెయ్యి రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రంలో ఉంది. అందుకే, భోజనానికి ముందు, తర్వాత కాళ్లు కడుక్కోవడం మంచిది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని రంతి దేవుడి కథల దగ్గర నుంచి మన శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నదానం చేస్తేనే సమస్త జీవకోటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.

లక్ష్మీదేవి ఒక వ్యక్తికి పరిపూర్ణమైన అదృష్టాన్ని ప్రసాదించేటప్పుడు, బ్రహ్మదేవుడు అడిగినప్పుడు, ఆమె ఆ వ్యక్తి పూర్వజన్మలో అన్నదానం చేశాడా లేదా అని చూస్తుందని ప్రతీతి. పూర్వజన్మలో అన్నదానం చేసినవారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి, వారు మహా అద్వితీయమైన ఐశ్వర్యవంతులుగా పుట్టి, మహారాజులుగా లేదా సమస్త భోగాలు అనుభవించేవారిగా ఎదుగుతారని చెబుతారు. దానం ధర్మం చేయని వారికి లక్ష్మీదేవి చూపు కిందకి చూస్తుందని కూడా ఉంది. ఆదిశంకరాచార్యుల విరచితమైన కనకధారా స్తవం కథ దీనికి నిదర్శనం. ఒకసారి స్వామివారు భిక్షాటనకు వెళ్లినప్పుడు, ఒక పేద బ్రాహ్మణ స్త్రీ తన దగ్గర ఏమీ లేకపోయినా, ఒక ఎండిపోయిన ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది. ఆమె బీదరికం చూసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి, “నాయనా శంకరా, ఈమె గత జన్మలో ఎవరికీ కనీసం కొద్దిగా కూడా అన్నదానం చేయలేదు” అని చెప్పింది. శంకరులు “అమ్మా, ఈ జన్మలో ఆమె వేసిన ఉసిరికాయను గత జన్మలో చేసిన దానంగా భావించి ఆమెకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు” అని అభ్యర్థించారు. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంట్లో బంగారు ఉసిరికాయలు కురిశాయి. ఈ కథ అన్నదానం యొక్క అనివార్యతను తెలియజేస్తుంది.

అందుకే మనం పుణ్యకార్యాలు, గృహప్రవేశాలు, పెద్దల మరణానంతర కార్యక్రమాలు, దసరా వంటి పండగలప్పుడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అన్నదానం రానున్న జన్మలకు కూడా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి “అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభ” అని పూజలందుకుంటుంది. సాక్షాత్తు శివపరమాత్మ కూడా లోకోత్తరణ కోసం, ఆర్తితో బాధపడేవారి ఆకలి తీర్చడానికి అన్నపూర్ణాదేవిని భిక్షమడిగాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా అన్నదానం సర్వదా శుభప్రదq.

Follow Us