AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: అహంకార భక్తుడికి భగవంతుడు నేర్పిన గుణపాఠం.. మీ హృదయాన్ని కదిలించే కథ!

భగవంతుడికి కేవలం ఆచారాలు, పూజలు మాత్రమే కాదు. స్వచ్ఛమైన మనసు, వినయం, సేవాభావం ఉన్నవారే నిజమైన భక్తులు. నిజమైన అనేది పూజలు, ఆచారాల్లో కాకుండా వినయం, కర్తవ్యనిర్వహణ, ప్రేమ, అహంకారం లేని హృదయంలో ఉంటుందని తెలిపే హృదయస్పర్శకమైన కథ ఇది. ఈ కథ నిజమైన భక్తి అసలైన అర్థాన్ని తెలియజేస్తుంది..

Moral Story: అహంకార భక్తుడికి భగవంతుడు నేర్పిన గుణపాఠం.. మీ హృదయాన్ని కదిలించే కథ!
God And Devotee Moral Story
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 10:17 AM

Share

ఒక గ్రామంలో శ్రీహరి భక్తుడైన ఓ బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి నదిలో స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి గంటల తరబడి పూజలు చేసేవాడు. చేతిలో జపమాల పట్టుకుని ఎప్పుడూ భగవన్నామం జపించేవాడు. గ్రామస్తులందరూ అతన్ని గొప్ప భక్తుడిగా భావించేవారు. కాలక్రమేణా ఆ బ్రాహ్మణుడికి తన భక్తిపై గర్వం పెరిగింది. ఈ గ్రామంలో నాకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు. నేను ప్రతిరోజూ పూజలు చేస్తున్నాను. భగవంతుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు అని అనుకునేవాడు.

ఒక రోజు పూజ ముగిసిన తర్వాత అతను భగవంతుడిని ప్రార్థిస్తూ.. ‘ప్రభూ! మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరో నాకు చూపించండి” అని కోరాడు.

ఆ రాత్రి అతనికి కలలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడు. భగవంతుడు చిరునవ్వుతో ‘రేపు ఉదయం గ్రామం చివర నివసించే రైతును కలువు. అతడే నాకు అత్యంత ప్రియమైన భక్తుడు’ అని చెప్పాడు. ఇది విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. “ఒక సాధారణ రైతా? అతను రోజంతా పొలంలో పనిచేస్తాడు. అతడు నాకంటే గొప్ప భక్తుడు ఎలా అవుతాడు?” అని అనుకున్నాడు. మరుసటి రోజు అతను రైతు ఇంటికి వెళ్లాడు. అక్కడ రైతు తెల్లవారగానే లేచి చేతులు జోడించి, ‘దేవుడా! ఈ రోజు నాకు, నా కుటుంబానికి శక్తి ఇవ్వు’ అని ఒక్కసారి ప్రార్థించి పొలానికి వెళ్లిపోయాడు. రోజంతా కష్టపడి పని చేసి, సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో గడిపి, పడుకునే ముందు మళ్లీ ఒక్కసారి, ‘ప్రభూ! ఈ రోజు నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు’ అని ప్రార్థించాడు.

ఇవి కూడా చదవండి

అంతే.. అతను గంటల కొద్దీ పూజలు చేయలేదు. జపాలు చేయలేదు. యజ్ఞాలు చేయలేదు. ఇది చూసిన బ్రాహ్మణుడు తిరిగి భగవంతుడిని ప్రశ్నించాడు. ‘ప్రభూ! నేను రోజుకు ఎన్నో గంటలు పూజలు చేస్తున్నాను. కానీ ఈ రైతు రోజుకు రెండుసార్లు మాత్రమే మీ పేరు తీసుకుంటున్నాడు. అయినా అతడే మీకు ప్రియమైన భక్తుడు ఎలా అయ్యాడు?’ అప్పుడు భగవంతుడు ఒక నూనెతో నిండిన పాత్రను అతనికి ఇచ్చి, ‘ఈ పాత్రలోని ఒక్క చుక్క కూడా కింద పడకుండా గ్రామం మొత్తం తిరిగి రా’ అని ఆజ్ఞాపించాడు.

బ్రాహ్మణుడు చాలా జాగ్రత్తగా పాత్రను పట్టుకుని గ్రామమంతా తిరిగి వచ్చాడు. ఒక్క చుక్క కూడా కింద పడలేదు. అప్పుడు భగవంతుడు అడిగాడు.. ‘గ్రామం తిరుగుతున్నప్పుడు నా పేరు ఎన్నిసార్లు జపించావు?’ బ్రాహ్మణుడు చెప్పాడు ‘ప్రభూ! నా దృష్టి మొత్తం పాత్రపైనే ఉంది. మీ పేరు ఒక్కసారి కూడా జపించలేకపోయాను’ అని అన్నాడు.

అప్పుడు భగవంతుడు ‘ఒక పాత్రను కాపాడడానికే నువ్వు నా పేరును మరచిపోయావు. కానీ ఆ రైతు రోజంతా కుటుంబ బాధ్యతలు, కష్టమైన పని, జీవన పోరాటం మధ్య కూడా నన్ను ఉదయం, సాయంత్రం భక్తితో స్మరిస్తున్నాడు. అతని హృదయంలో అహంకారం లేదు. తన పనినే సేవగా భావిస్తున్నాడు. అందుకే అతడే నిజమైన భక్తుడు’ అని అన్నాడు

ఈ మాటలు విన్న బ్రాహ్మణుడికి తన తప్పు అర్థమైంది. భక్తి అంటే కేవలం పూజలు, జపాలు మాత్రమే కాదని గ్రహించాడు. వినయం, నిజాయితీ, కర్తవ్య నిర్వహణ, ప్రేమతో దేవుణ్ణి స్మరించడం కూడా భక్తిలో భాగమని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను గర్వాన్ని విడిచిపెట్టి అందరినీ సమానంగా చూడటం ప్రారంభించాడు. సేవాభావంతో జీవిస్తూ నిజమైన భక్తుడిగా మారాడు.

భక్తి అనేది ఆచారాల్లో కాదు, హృదయంలో ఉంటుంది. అహంకారం లేని ప్రేమ, కర్తవ్యనిర్వహణ, వినయం కలిగినవారే నిజమైన భక్తులు.

Follow Us