Jampannavagu: ఉధృతంగా ప్రవహిస్తోన్న జంపన్నవాగు.. ఇంకా తెలీని ఇద్దరి ఆచూకీ.. ఇవాళా కొనసాగుతోన్న గాలింపు

ములుగు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జంపన్నవాగులో కొట్టుకుపోయిన ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. నిన్న మేడారం సమ్మక్క- సారక్క..

Jampannavagu: ఉధృతంగా ప్రవహిస్తోన్న జంపన్నవాగు.. ఇంకా తెలీని ఇద్దరి ఆచూకీ.. ఇవాళా కొనసాగుతోన్న గాలింపు
Jampanna Vagu
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 13, 2021 | 7:29 AM

Jampannavagu – Mulugu: ములుగు జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు జంపన్నవాగులో కొట్టుకుపోయిన ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. నిన్న మేడారం సమ్మక్క- సారక్క దేవతల దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు జంపన్న వాగులో పడి గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన ఇద్దరు మణుగూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బంగారి శ్యామల్ రావు (25), కోటేశ్వరరావు (31)గా గుర్తించారు.

నిన్నటి నుండి గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఇద్దరి ఆచూకీ లభించక పోవడంతో బాధితుల బంధువులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇలా ఉండగా, ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు  జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.

మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కడెం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 697‌.7 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 34, వేల క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 30 వేల క్యూసెక్కులుగా ఉంది.

అటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజికి భారీగా వరద వస్తోంది. బ్యారేజిలో 24 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Read also: Iraq: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం, ఆర్తనాదాలు.. కరోనా చికిత్స పొందుతోన్న 50 మంది అగ్నికి ఆహుతి.!