Telangana: పర్యాటక కేంద్రంగా ఆకర్షిస్తున్న వైజాగ్ కాలనీ.. ప్రకృతిని ఆస్వాదిస్తున్న టూరిస్టులు
నాగార్జునసాగర్ అనగానే గుర్తుకు వచ్చేది.. ప్రపంచ పర్యాటక కేంద్రం. ఇప్పుడు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ బ్యాక్ వాటర్ వెనక దాగి ఉన్న ప్రాంతమే వైజాగ్ కాలనీ. ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం. అంతేకాదు చేపలు, నాటు కోడికూర రుచులకు, జొన్న రొట్టెలకు ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
నాగార్జునసాగర్ అనగానే గుర్తుకు వచ్చేది.. ప్రపంచ పర్యాటక కేంద్రం. ఇప్పుడు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ బ్యాక్ వాటర్ వెనక దాగి ఉన్న ప్రాంతమే వైజాగ్ కాలనీ. ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం. అంతేకాదు చేపలు, నాటు కోడికూర రుచులకు, జొన్న రొట్టెలకు ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. కాగా పర్యాటకులు సాగర తీరంలో సేదతీరుతూ పచ్చని కొండల నడుమ ఆనందంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వెనక ఉన్న వైజాగ్ కాలనీ సంగతిలేంటో తెలుసుకుందాం. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరేడుగొమ్మ మండలాల్లో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ కలిసి ఉంటుంది. నేరేడుగొమ్మ మండలంలోని వైజాగ్ కాలనీ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారుతోంది. ఆదివారం సెలవు దినాల్లో పర్యాటకులతో వైజాగ్ కాలనీ సందడిగా కనిపిస్తోంది.
నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ తో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వైజాగ్ కాలనీ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కనువిందు చేసే కొండల నడుమ.. గిరిజన తండాలు కనిపిస్తుంటాయి. ఇక్కడి ప్రకృతి అందానికి పర్యాటకులు పులకించిపోతారు. దీంతో సెలవు దినాల్లో హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వైజాగ్ కాలనీ అందాలను తిలకించేందుకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్థానిక మత్స్యకారుల కుటుంబాలు భోజన ఏర్పాట్లు చేస్తారు. పర్యాటకులకు అవసరమైన తాజా చేపలు వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ చేపల పులుసు, చేపల ఫ్రై వంటకాలు టూరిస్టులకు వండి పెడుతుంటారు.
నాటుపడవలు, మర బోట్ల ద్వారా టూరిస్టులను సాగర్ జలాశయం అలలపై జాలీగా ట్రిప్పులు తిప్పుతుంటారు. బోట్లలో సాగర్ అలలపై ప్రయాణిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. వేసవి కాలంలో సాగర్ రిజర్వాయర్ లో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు ఐల్యాండ్ లు కనిపిస్తుంటాయి. ఐల్యాండ్ లు చూసి పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. ఇటీవల కాలంలో వైజాగ్ కాలనీ అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా… అభివృద్ధి చెందే అవకాశం ఉంది.