Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భూసేకరణ చేపట్టండి.. రహదారులపై సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

Telangana: భూసేకరణ చేపట్టండి.. రహదారులపై సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy CM KCR
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 6:40 PM

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నిలిచిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖ యధావిధిగా..

కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మిస్తోంది. ఈ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948 న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటినుండి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. అదే 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా, రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అందులో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో (మంజూరు చేయబడినవి/బిడ్డింగ్ దశలో ఉన్నవి/మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నవి) ఉన్నాయి. ఈ 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేకసార్లు లేఖలు వ్రాయడం జరిగింది.

అయినప్పటికీ, ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా 4,048 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయవలసి ఉంది. ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టుల వివరాలను పంపిస్తున్నాం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, వేలాది కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జాతీయ రహదారులు ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాలలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయాయి. ప్రమాదాలు కూడా తగ్గాయి. అదే విధంగా ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించి ఇస్తే ఆయా రహదారి ప్రాజెక్టులు నిర్ధేశించిన సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలుగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా చొరవ చూపించాలి. ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి వీలుగా చర్యలు తీసుకోవాలి. అంటూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..