తెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది. లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడేలా, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశ్యంతో ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ రీజియన్ & అపారెల్ పార్క్(PM-Mitra)’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఫార్మ్ టు ఫైబర్; ఫైబర్ టు ఫ్యాక్టరీ; ఫ్యాక్టరీ టు ఫ్యాషన్; ఫ్యాషన్ టు ఫారిన్ అనే ‘5F’ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ 7 మెగా టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించారు.
ప్రధాని మోదీ ప్రకటన:
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడటంతో పాటు, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్ పార్కును తెలంగాణకు ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే యావత్ తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా టెక్స్‌టైల్ పార్కు ప్రధానమంత్రి తెలంగాణకు అందించిన కానుక అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ, దుర్రీలు వంటి GI ట్యాగ్ కలిగి ఉన్న ఎన్నో చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్న రైతులకు, చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఇలాంటి ‘పీఎం-మిత్ర’ ప్రాజెక్టుకోసం దరఖాస్తు చేసుకోవాలంటూ 14 ఫిబ్రవరి, 2022న తెలంగాణ సీఎం చంద్రశేఖర రావుకు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కిషన్ రెడ్డి స్పందన:
లక్షలాదిమంది రైతులకు,చేనేత కార్మికులకు ఉపయోగపడే,వేలాదిమంది యువతకు ఉద్యోగాలందించే మెగా టెక్స్టైల్స్ పార్కును ప్రకటించిన ప్రధాని @narendramodi గారికి యావత్ తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ అభివృద్ధిపట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
అంతేకాకుండా ప్రధానమంత్రిని, టెక్స్‌టైల్ శాఖ మంత్రిని కలిసినపుడు ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ మెగా టెక్స్‌టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్‌టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.