Telugu Chief Ministers: ఎన్నికల దిశగా తెలుగు ముఖ్యమంత్రుల అడుగులు వేగం.. కీలక నిర్ణయాలు.. వ్యూహరచనలు.. రంజుగా రాజకీయం

అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా అధికార పార్టీల దూకుడు చూస్తుంటే కొన్ని నెలల ముందే ఎన్నికలకు అధికార పార్టీలు సమాయత్తమవుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి సహజంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయనుకోవచ్చు.

Telugu Chief Ministers: ఎన్నికల దిశగా తెలుగు ముఖ్యమంత్రుల అడుగులు వేగం.. కీలక నిర్ణయాలు.. వ్యూహరచనలు.. రంజుగా రాజకీయం
Andhra CM YS Jagan Reddy - Telangana CM K Chandrasekhar Rao
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 03, 2023 | 9:07 PM

షెడ్యూలు ప్రకారం జరిగితే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆరు నెలల గ్యాప్ వుండాలి. దాని ప్రకారమే రాజకీయం కొనసాగాలి. కానీ అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా అధికార పార్టీల దూకుడు చూస్తుంటే కొన్ని నెలల ముందే ఎన్నికలకు అధికార పార్టీలు సమాయత్తమవుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి సహజంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చాలా ముందుగానే ఎన్నికల నగారా మోగించాయనే చెప్పాలి. అసెంబ్లీకి రానని భీష్మించుకున్న విపక్ష నేత చంద్రబాబు రాజకీయాల్లో యాక్టివ్‌గా వుండేందుకు జిల్లాల పర్యటనలను ఎంచుకున్నారు. ఆయన తనయుడు నారా లోకేశ్ దాదాపు ఏడు నెలల క్రితమే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో సుదీర్ఘ కాలం, సుదూరం కొనసాగిన పాదయాత్రగా లోకేశ్ యువగళం నిలిచిపోయేలా వుంది. ఎందుకంటే ఆయన దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. తాజాగా పది రోజుల నుంచి చంద్రబాబు కూడా తన పర్యటనల్లో వేగం పెంచారు. తనను వృద్ధ నేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి పోల్చడాన్ని ఆక్షేపిస్తున్న చంద్రబాబు వయసు మీద పడ్డా తనలో వేగం తగ్గలేదన్నట్లుగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ కుటుంబానికి ఆయువు పట్టైన పులివెందులలో పర్యటించిన చంద్రబాబు ‘‘ వై నాట్ పులివెందుల ’’ అన్న నినాదాన్ని వినిపించారు. అక్కడ్నించి టీడీపీ నేత బీటెక్ రవిని అభ్యర్థిగా ప్రకటించారు. జనసేన పార్టీ కూడా చాలా ముందుగానే ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పాలి. జూన్ నెలలోనే పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర పేరిట ప్రత్యేక వాహనంలో జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతల వారాహి విజయ యాత్ర పూర్తి కాగా.. మూడో విడత యాత్రను ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించి, 19వ తేదీ దాకా నిర్వహించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేశారు. ఇంకోవైపు తమ ట్రెడిషన్‌ను పక్కన పెట్టేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఎంచుకుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముడిపడి వుంటే నేతలకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే ట్రెడిషన్‌ని బీజేపీ బ్రేక్ చేసింది. చరిష్మా కలిగిన నేత సారథిగా వుంటే మేలని బీజేపీ భావించింది. విపక్షాల హడావిడి పెరిగిపోవడంతో అధికార పార్టీ కూడా మెల్లిగా ఎన్నికల దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. నిజానికి గత రెండు నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారంలో రెండు, మూడు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తూనో, శంకుస్థాపనలు చేస్తూనో ప్రజల్లో తిరుగుతున్నారు. గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నియోజక వర్గాల పరిశీలకులతో జగన్ నమ్మిన బంటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అవడంతో అధికార పార్టీ కూడా ఎన్నికల సన్నాహాలను ప్రారంభించినట్లయ్యింది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు, పార్టీలో అంతర్గత గ్రూపులను రూపు మాపి, అంతా ఒక్క తాటి మీద నడిచేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి 175 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిశీలకులతో సమావేశమయ్యారని చెబుతున్నారు. అయితే, ఇక్కడ ఓ అంశం ప్రస్తావనార్హంగా కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జగన్.. ‘‘ వై నాట్ 175 ’’ అన్న నినాదాన్ని వినిపించారు. అంటే ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాలను తమ పార్టీ ఎందుకు కైవసం చేసుకోలేదు అన్నది ఆయన ఉద్దేశం. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలను గెలుచుకునేలా వ్యూహరచన, కార్యాచరణకు జగన్ సంసిద్దమయ్యారు. దానికి అనుగుణంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని లోతుగా తెలుసుకునేందుకు పలు మార్గాలను ఎంచుకున్నారు. అందులో ఒకటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ ప్యాక్ సంస్థతో సర్వే చేయించడం. ఇది గత ఏడాది కాలంలో రెండు, మూడు విడతలుగా జరిగినట్లు సమాచారం. ఐ ప్యాక్ సర్వే ప్రకారం 151 వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 40 మంది పనితీరు బాగా లేదని తేలింది. దాంతో వారితో జగన్ స్వయంగా భేటీ అయ్యారు. సెప్టెంబర్ దాకా టైమిచ్చి, పనితీరు మెరుగుపరచుకోవాలని వార్నింగిచ్చారు. వారికి వార్నింగిచ్చి దాదాపు నెలన్నర కావస్తున్న తరుణంలో సజ్జల .. 175 నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలను వేగవంతం చేయడం, ఇంకోవైపు సజ్జల లాంటి పార్టీ పెద్దలు నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేసి, దానికి అనుగుణంగా మార్పులు చేర్పులను అధినేత జగన్ మోహన్ రెడ్డికి సూచించడం.. ఇలా ఏపీలో అధికార పార్టీ.. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయ్యింది.  ఏపీలో ముందస్తు ఎన్నికలు లేవని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు కాస్త గట్టిగానే చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాన్ని అంచనా వేయడం కష్టమని భావిస్తున్న తెలుగుదేశం, జనసేన. బీజేపీలు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా రెడీగా వుండాలన్నట్లు పర్యటనలను, పాదయాత్రలను, సభలను, పార్టీ సమావేశాలను వేగవంతం చేశాయి.

ఇక తెలంగాణలో నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నిజానికి గత సంవత్సరం నుంచి ముందస్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారని విపక్షాలు భావిస్తున్నాయి. 2018లో అనూహ్య నిర్ణయం ద్వారా ముందస్తుకు వెళ్ళి కేసీఆర్ విపక్షాలకు షాకిచ్చారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలను క్లీన్ బౌల్డ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలకే పరిమితమై చతికిలా పడింది. బీజేపీ అయితే మరీ ఘోరంగా ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ తర్వాత కాలంలో గులాబీ ఆకర్షతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది కేసీఆర్ పార్టీకి మారిపోగా.. కేవలం 6 ఎమ్మెల్యేలతో సీఎల్పీ అసెంబ్లీలో మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ మాత్రం రెండు ఉప ఎన్నికల్లో సానుకూల ఫలితాలను రాబట్టుకుని ఎమ్మెల్యేల నెంబర్‌ని మూడుకు పెంచుకుంది. కానీ, తొలుత సింగిల్‌గా బీజేపీ తరపున గెలిచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తన నోటి దురుసుతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. ప్రస్తుతం శాసనసభలో బీజేపీ సభ్యుల సంఖ్య రెండుగా కొనసాగుతోంది. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతున్నా అలాంటి సంకేతాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేసీఆర్ ప్రజాకర్షక పనులపై నజర్ పెట్టారు. చాలా కాలంగా పెండింగులో వున్న రైతు రుణ మాఫీకి ఆగమేఘాల మీద ఉత్తర్వులిచ్చారు. నెల రోజుల వ్యవధిలో రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మరోవైపు తెలంగాణలోని మొత్తం 119 సీట్లలో మూడొంతుల అసెంబ్లీ సీట్లు కలిగిన ఏరియాలకు మెట్రో రైలును విస్తరిస్తామని ప్రకటించారు. మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని, తన తనయుడు, మునిసిపల్ మంత్రి కేటీరామారావు చేత ప్రకటింపచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుతం 69.6 కి.మీ.ల దూరం మాత్రమే మెట్రో రైలు నడుస్తోంది. పాతబస్తీలోకి ఫలక్‌నుమా దాకా 5.5 కి.మీ.లు పూర్తయ్యే ప్రక్రియ కొనసాగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇదింకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కక ముందే ఏకంగా మొత్తం 415 కిలో మీటర్ల మేరకు మెట్రో రైలును వచ్చే నాలుగేళ్ళలో విస్తరిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త జిల్లాల పరిధి మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, భువనగిరి యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు మెట్రో రైలు విస్తరించనున్నది. ఆచరణలో ఇది ఏమేరకు సాధ్యమనేది పక్కన పెడితే.. కేసీఆర్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో రెడీ అవుతున్నారన్నది మాత్రం ఈ ప్రకటనతో తేటతెల్లమైంది. దానికి తోడు వికలాంగుల పెన్షన్ మొత్తాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఇదివరకే ఓ ప్రకటన చేశారు. ఎన్నికల దిశగా కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం. ఆర్టీసీ కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ విలీనంపై తాజాగా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న మొత్తం 43 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చబోతున్నారు. ఇదే క్రమంలో మరింత వేగంగా మరికొన్ని ప్రజాకర్షక పథకాలను కేసీఆర్ ప్రకటించబోతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా కర్నాటకలో ఫలించిన ఉచిత హామీల వ్యూహంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది.