AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం.. ఎప్పట్నుంచంటే..?

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. 19 నాటి రాత్రి దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.

Telangana: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం.. ఎప్పట్నుంచంటే..?
Yadadri Temple Brahmotsavam
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 04, 2024 | 11:14 AM

Share

తెలంగాణ తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతోంది యాదగిరి గుట్ట.. యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాదాద్రి క్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్యపూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామివారి సన్నిధి మార్మోగుతుంది. పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బుర పరుస్తాయి. పాల్గుణ మాసం తొలిరోజు అంటే మార్చి 11న ఆలయ ఉత్సవాలు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ప్రారంభమై.. ద్వాదశి రోజు మార్చి 21న గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి.

క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించనుంది. త్వరలోనే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సహకారానికి ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు దేవస్థానం లేఖలు రాసింది. సాంస్కృతిక కార్యక్రమాలను అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు.

18న స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణోత్సవం..

ఇవి కూడా చదవండి

11 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మూడ్రోజుల విశేష ఉత్సవాలు ఉంటాయి. 11వ తేదీన స్వస్తి వచనంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. అష్టోత్తర శతఘటాభిషేకంతో పూర్తి అవుతాయి. బ్రహ్మోత్సవాల్లో 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. 19 నాటి రాత్రి దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.

8 నుంచి అఖండ జ్యోతి యాత్ర..

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని బర్కత్‌పుర నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర మార్చి 8న ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయల్దేరిన జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల ప్రచారం నిర్వహిస్తూ వార్షిక ఉత్సవాల అంకురార్పణ రోజు 11వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..