Telangana: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కొత్త కోర్సులన్నీ ఆనర్స్‌వే.. నాలుగేళ్ల డిగ్రీలను ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నత విద్యామండలి
తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం..

తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఉన్నత విద్యలో ఈ మేరకు మార్పులు చేయనున్నారు. సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అన్ని రాష్ట్రాలకు తెలిపింది. దీనిపై ఇటీవల యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాలపై నివేదికను కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయమై యూజీసీ చైర్మన్ తో ఉన్నల విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చర్చించారు. త్వరలో ఆనర్స్ కోర్సులపై అన్ని యూనివర్సిటీల వీసీలతో చర్చించాలని నిర్ణయించింది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో ఎంత మంది విద్యార్ధులు నాలుగేళ్ల కోర్సులను చదివేందుకు ఇష్టపడతారనే దానిపై అధ్యయనం చేసిన తర్వాత కాలేజీల్లో ఆనర్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్, బీకాం ఆనర్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇదే తరహాలో ఓయూ పరిధిలో లైఫ్‌సైన్స్ కోర్సును ఆనర్స్‌గా తేవాలనే యోచనలో మండలి ఉంది. ఇక ఆనర్స్ కోర్సులు తీసుకున్న వారికి పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
మూడేళ్ల కోర్సు తర్వాత నాలుగో ఏట విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్, కెనడా వంటి దేశాలకు వెళ్లి అక్కడి సంస్థల్లో కోర్సు చేసేలా ఈ కోర్సును డిజైన్ చేస్తున్నారు. డిగ్రీతోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు అనువైన కోర్సులు అందించనున్నారు. డిగ్రీ తర్వాత నేరుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చేలా కంప్యూటర్ కోర్సులను ఆనర్స్‌గా అందించాలని నిర్ణయించారు. బీఎస్సీ ఆనర్స్ పేరుతో తెచ్చే ఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్‌ను జోడించబోతున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులనూ తెచ్చే యోచనలో ఉన్నారు. బీఎస్సీ (ఆనర్స్)లో చేరి మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని, నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇవ్వాలని భావిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.