ఒంట్లో రక్తాన్ని అమ్మి కూతురికి వైద్యం! కానీ చివరకు.. ‘గుండెలు పిండే విషాదం’
గుండెలపై పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాల పట్టి మంచంపై జీవశ్చవంలా పడి ఉండటాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా కూతురు లేచి నడవాలని ఇల్లూ, పొలం, ఆస్తులు.. తనకు కలిగిన దంతా అమ్మి వైద్యం చేయించాడు. ఐనా విధి ఆ తండ్రి ప్రయత్నాన్ని చిన్న చూపు..
గుండెలపై పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాల పట్టి మంచంపై జీవశ్చవంలా పడి ఉండటాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా కూతురు లేచి నడవాలని ఇల్లూ, పొలం, ఆస్తులు.. తనకు కలిగిన దంతా అమ్మి వైద్యం చేయించాడు. ఐనా విధి ఆ తండ్రి ప్రయత్నాన్ని చిన్న చూపు చూసింది. చివరికి తిండికి కూడా కరువైపోగా.. తన ఒంట్లో రక్తాన్ని అమ్మి కుటుంబం కడుపునింపాడు. కాలానికి ఎదురీదాలని ఆ తండ్రి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడంతో చివరికి ఆశువులు బాశాడు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మృతుడి కూతురు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చెందిన ప్రమోద్ గుప్తా అనే వ్యక్తికి భార్య, అనుష్కా గుప్తా (17) అనే కుమార్తె ఉన్నారు. ప్రమోద్ స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న వీరి కుటుంబం రోడ్డు ప్రమాదం అనుకోని మలుపు తిప్పింది. ఐదేళ్ల క్రితం కూతురు అనుష్కా గుప్తా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అనుష్కా ప్రాణాలతో బయటపడ్డా, వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమైంది. కూతురును మామూలు మనిషిని చేయడానికి ప్రమోద్ దాచుకున్న డబ్బుతో పాటు ఆస్తులు, దుకాణం, ఇల్లు కూడా అమ్ముకున్నాడు. అయినా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు. తీవ్రంగా కుంగిపోయిన ప్రమోద్ కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి దాపురించడంతో పలుమార్లు రక్తం విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మరింత కుంగిపోయిన ప్రమోద్ మంగళవారం వేకువజామున కూతురికి ఫోన్ చేసి, తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కూతురు అనుష్కా గుప్తా గుండెలవిసేలా రోధించింది.
నిజానికి అనుష్కా గుప్తా పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని అప్పట్లో హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ సాయం అందించినవారులేదు. తన కోసం తండ్రి ఎంతో కష్టపడ్డాడని, కుటుంబాన్ని పోషించడానికి రక్తం అమ్మడంతో తండ్రి అనారోగ్యం పాలయ్యి.. చివరికి ప్రాణాలే తీసుకున్నాడని కన్నీటి పర్యాంతమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.