Bilawal Bhutto: భారత్‌లో పర్యటించనున్న పాక్‌ మంత్రి.. తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి! కారణం ఇదే..

ఇండియా-పాక్‌ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అంత పటిష్టంగాలేని టైంలో పాక్‌ మంత్రి భారత్‌లో పర్యటించడం సర్వత్రా చర్చణీయాంశమైంది.

Bilawal Bhutto: భారత్‌లో పర్యటించనున్న పాక్‌ మంత్రి.. తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి! కారణం ఇదే..
Pak Minister Bilawal Bhutto
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 20, 2023 | 3:17 PM

పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది మే నెలలో రెండు రోజులపాటు జరగబోయే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ గురువారం (ఏప్రిల్‌ 20) ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు కావాలని కోరుతూ ఇస్లామాబాద్‌కు న్యూఢిల్లీ ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానంపై పాకిస్థాన్‌ నేడు స్పష్టత ఇచ్చింది. 2011 జూలైలో భారత్‌ను పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ చివరిసారిగా సందర్శించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పాక్‌ మంత్రి భారత్‌ను తొలిసారి సందర్శించనున్నారు.

భారత్ అధ్యక్షతన మే నెల 4, 5 తేదీల్లో గోవాలో షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరగనున్నాయి. దీనికి వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనిలో భాగంగా మే మొదటి వారంలో భారత్‌కు రావల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి భారత్‌ ఆహ్వానం పలికింది. ఈ సమావేశానికి పాక్‌తోపాటు చైనా, రష్యా, కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ దేశాలకు (మొత్తం 8 దేశాలు) చెందిన విదేశీ మంత్రులు హాజరవుతారు. కాగా ఈ 8 సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రెండు దశాబ్ధాల క్రితం (2001) షాంఘై సహకార సంస్థ ఏర్పడింది. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలో 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్‌ ఉగ్రవాద మూక జరిపిన దాడి సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్‌ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పరస్పరదాడుల అనంతరం భారత్‌-పాక్‌ ఎడమొకం పెడమొకంగా ఉంటున్నాయి. ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రాలుగా విభజిస్తూ భారత్‌ ప్రకటించిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు భారతదేశం ప్రకటించిన తర్వాత సంబంధాలు మరింత క్షీణించాయి. ఇండియా-పాక్‌ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అంత పటిష్టంగాలేని టైంలో పాక్‌ మంత్రి భారత్‌లో పర్యటించడం సర్వత్రా చర్చణీయాంశమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.