Telangana: స్కిల్‌ యూనివర్సిటీగా మారనున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. త్వరలో అధికారిక ప్రకటన

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఆనుకొని ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో కలుకితురాయి చేరనుంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్ సరసన మరో విశ్వవిద్యాలయం చేరనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు మానవ వనరుల సమగ్ర అభివృద్ధి ఒక్కటే శాశ్వత పరిష్కారమని పాలకులు..

Telangana: స్కిల్‌ యూనివర్సిటీగా మారనున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. త్వరలో అధికారిక ప్రకటన
Swami Ramananda Tirtha Rural Institute
Follow us
M Revan Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Feb 02, 2024 | 10:15 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఆనుకొని ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో కలుకితురాయి చేరనుంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బీబీనగర్ ఎయిమ్స్ సరసన మరో విశ్వవిద్యాలయం చేరనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనకు మానవ వనరుల సమగ్ర అభివృద్ధి ఒక్కటే శాశ్వత పరిష్కారమని పాలకులు భావించారు. దీంతో1995లో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌ను యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లు నిధులు లేక నీరసిస్తున్న గ్రామీణ సంస్థకు పునర్‌వైభవం రానుంది.

పలు రంగాల్లో గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణ..

పదవ తరగతి తర్వాత ఆపై చదువుల్లో ఫెయిల్ అయిన గ్రామీణ నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తోంది. సుమారు మూడు దశాబ్దాలుగా గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించింది. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మెకానిక్, బేసిక్ కంప్యూటర్, డాటా ఎంట్రీ, సోలార్ ఎనర్జీ, అకౌంటింగ్ ప్యాకేజ్ వంటి పలు కోర్సుల్లో నిరుద్యోగ యువతకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఏటా పది వేల మంది గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ కోర్సుల్లో పనిచేస్తున్న 400 మందికి వసతి లభిస్తుంది.

యూనివర్సిటీగా మారితే మరిన్ని ఉపాధి అవకాశాలు…

రామానంద తీర్థ గ్రామీణ సంస్థను స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీగా ప్రభుత్వం గుర్తిస్తే.. ఇక్కడి గ్రామీణ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అదనపు కోర్సులతోపాటు వేయి మందికి సరిపడా వసతిని కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. అయితే గత 12 ఏళ్లుగా సంస్థకు ఛైర్మన్‌తో పాటూ గవర్నింగ్‌ బాడీ సైతం లేకపోవడంతో విస్తరణ కేంద్రాలు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టలేక పోయారు. తాజా నిర్ణయంతో త్వరలోనే దీనికి వైస్‌ ఛాన్స్‌లర్‌ ను నియమించనుంది. దీంతో రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు నిధులతోపాటు పూర్వ వైభవం కలగనుంది.

ఇవి కూడా చదవండి

త్వరలో ఉన్నతాధికారుల పర్యటన, సమీక్ష..

రామానంద తీర్థ గ్రామీణ సంస్థను విశ్వవిద్యాలయ ఏర్పాటుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వారం పది రోజుల్లో ఇక్కడికి రానున్నారు. సంస్థను స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీకి కావలసిన మౌలిక వసతులు, నిధులు వంటి అంశాలపై ఉన్నతాధికారుల బృందం సంస్థ అధికారులతో చర్చించనుంది. దాంతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్థ పరిధిలో ఉన్న 38 విస్తరణ కేంద్రాల్లో కొనసాగుతున్న కోర్సులపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. రామానంద తీర్థ గ్రామీణ సంస్థను యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తే.. మార్కెట్ లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టి గ్రామీణ విద్యార్థులకు వసతితో పాటూ శిక్షణను ఇప్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.