Telangana Farmers: తెలంగాణలో రూటు మారుస్తున్న రైతన్నలు.. అండగా ఉంటామంటున్న ప్రభుత్వం.. ఇంతకీ ఏం జరుగుతోందంటే..!

Telangana Farmers: సర్కారు వరి వద్దంటోంది. గింజ కూడా కొనేది లేదని తేల్చి చెప్తోంది. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో రైతన్నల దృష్టికి తీసుకెళ్తోంది. అందుకే క్రమంగా రైతుల ఆలోచనలు

Telangana Farmers: తెలంగాణలో రూటు మారుస్తున్న రైతన్నలు.. అండగా ఉంటామంటున్న ప్రభుత్వం.. ఇంతకీ ఏం జరుగుతోందంటే..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 03, 2022 | 10:41 AM

Telangana Farmers: సర్కారు వరి వద్దంటోంది. గింజ కూడా కొనేది లేదని తేల్చి చెప్తోంది. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో రైతన్నల దృష్టికి తీసుకెళ్తోంది. అందుకే క్రమంగా రైతుల ఆలోచనలు ఇతర పంటల వైపు వెళ్తున్నాయి. గిట్టుబాటు ధర అధికంగా వచ్చే పంటలు వేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి రైతుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు కూడా తమ వంతు సహాయం చేయబోతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ ఉన్న పంటలను వేసేలా ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక కథనం..

కాళేశ్వర౦ నీళ్లతో ఎటు చూసినా నిన్న, మొన్నటి వరకు పచ్చని పొలాలే కనిపించేవి. రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చేది. అయితే యాసంగిలో వరి వద్దని చెప్పడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. అయితే, కొందరు రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే పంటలను ఎంచుకుంటున్నారు. ఆలస్యంగా పంట చేతికి వచ్చినప్పటికీ.. గిట్టుబాటు ధర అధికంగా ఉండేలా చూస్తున్నారు. అందుకే పలువురు రైతులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ వేసేందుకు ముందుకు వస్తున్నారు. సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవుపల్లిలో 15 వేల ఎకరాలకు సరిపడే ఆయిల్ పామ్ మొక్కలను నర్సరిలో పెంచుతున్నారు. జిల్లాకు చెందిన రైతులను ఆయిల్ పామ్ పంటల వైపు నడిపించేందుకు ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు క్షేత్ర స్థాయి సందర్శనకు తీసుకెళ్లారు అధికారులు. జిల్లాలో ఇప్పటికే ఆరు వేలకు పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆరు వందల మంది రైతులు ముందుకు వచ్చారు. మరోవైపు ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వం ఎకరాకు 30 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం సహాయం చేయనుంది.

ఆయిల్ పామ్ పంట నాలుగు సంవత్సరాల తర్వాత చేతికి వస్తుంది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, మార్కెట్‌లో టన్నుకు 17 నుంచి 18 వేల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట లక్ష్యాలను విధించింది. పెద్దపల్లి జిల్లాలో 45 వేల ఎకరాల వరకు అధికారులు సాగును టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి రైతులు ఎంత మేరకు ముందుకు వస్తారో, వచ్చిన రైతులు ఎంత మేరకు లాభాల బాట పడతారో చూడాలి. ఆయిల్ పామ్ పంటలపై యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

Also read:

KGF-2: కేజీఎఫ్-2 నుంచి ఇంట్రెస్టింగ్‌ రూమర్‌.. ఆ వింటేజ్‌ సాంగ్‌ రీమిక్స్‌ చేశారా..!

Gangula Kamalakar: రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్‌ దీక్ష.. మంత్రి గంగుల ఆగ్రహం..

NFO: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ప్యాసివ్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్..