CM Kcr on Rains: వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..

CM Kcr on Rains: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని..

CM Kcr on Rains: వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
Telangana CM KCR
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 09, 2022 | 4:24 PM

CM Kcr on Rains: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్ లను అప్రమత్తం చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం నాడు సీఎస్‌తో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్న నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని, పరిస్థితులను బట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

మరోవైపు జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, ఎలాంటి నష్టాలు జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇరిగేషన్ శాఖకు కీలక ఆదేశాలు.. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు సీఎం కేసీఆర్. వరదలను ఎదుర్కొనేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు సీఎం కేసీఆర్. ఇదిలాఉంటే.. ఈ నెల 11న ప్రగతి భవన్‌లో నిర్వహించతలపెట్టిన ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవిన్యూ అవగాహన సదస్సు’ లను వాయిదా వేశారు. వర్షాలు తగ్గాక ఈ సదస్సులను నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో అలర్ట్.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న మేయర్.. గత రెండు రోజుల నుండి ఏడతెరపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌ను పరిశీలించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఓఎస్డీ అనురాధను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిన్నటి నుంచి 1.5 – 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, 383 ఫిర్యాదులు అందాయని, ఇప్పటి వరకు 375 పరిష్కరించామని, మిగిలిన 8 పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. అలాగే, సీజన్ వ్యాధులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. SNDP పనులు ఎక్కడ జరుగుతున్నాయో ప్రజలకు తెలియజేసే సూచిక బోర్డులను జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతి పని వద్ద ఒక అధికారిని నియమిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారని వివరించారు.

రెస్క్యూటీమ్ ఏర్పాటు.. మొబైల్, మిని మొబైల్, స్టాటికల్ లాంటి మాన్సూన్ ఏమెర్జన్సీ టీమ్ లను ఏర్పాటు చేసి రోడ్లపై నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌరులు తమకు ఏమైనా సమస్యలుంటే.. 040-21111111, 04029555500 నంబర్లను సంప్రదించాలని మేయర్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల  కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..