AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: కర్ణాటక, తెలంగాణలో గెలిచిన హస్తం పార్టీ వెనుక ఉన్న హస్తం ఇదే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది.

Congress Party: కర్ణాటక, తెలంగాణలో గెలిచిన హస్తం పార్టీ వెనుక ఉన్న హస్తం ఇదే..
Sunil Kanugulu Is A Political Strategist, Worked For The Victory Of Congress In Telangana And Karnataka
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Dec 04, 2023 | 12:31 PM

Share

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలపై బలమైన ముద్ర వేసినా, ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు మెరుగైన ఓట్ షేర్ లభించినా, రేవంత్ రెడ్డి మొదలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, జానారెడ్డి వంటి సీనియర్లందరూ ఏకతాటిపై నిలిచినా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై అధిక దృష్టి పెట్టినా.. ఇలా ప్రతి అంశం వెనుక ఉన్న హస్తం.. సునీల్ కనుగోలు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన క్షణం నుంచే సునీల్ కనుగోలు పేరు ఘనంగా వినిపించడం మొదలైంది. చాపకింద నీరులా పనిచేసుకుపోయే 39 ఏళ్ల సునీల్ కనుగోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ ప్రచారం కొనసాగడంలో సునీల్ ది ప్రముఖ పాత్ర. సునీల్ తన సామర్ధ్యం నిరూపించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి మోగించడం వెనుక ఉన్నది కూడా ఇతడే. అతడి వ్యూహ చతురతకు మెచ్చి కర్ణాటక సర్కారు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంది.

ఇప్పటివరకు దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిశోర్ పేరు వినిపించేది. దేశవ్యాప్తంగా ఆయన పనిచేసిన పార్టీలు విజయం సాధించిన ఉదంతాలే ఎక్కువ. ఏపీలోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు అంతకంటే సునీల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే.. దాదాపు పతనం అంచుల వరకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడమే కాదు, తెలంగాణలోనూ రూపురేఖలు కోల్పోయిన హస్తానికి జీవం పోయడం సునీల్ కే చెల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిశోర్ సహచరుడే. 2014లో ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు బీజేపీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ కంటే ముందే సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా పనిచేశారు. సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్ అప్పట్లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) స్థాపించి ప్రధానిగా నరేంద్ర మోదీని గద్దెనెక్కించడం కోసం కృషి చేశారు.

ఇవి కూడా చదవండి

సునీల్ కనుగోలు తన పేరు మీదే ‘ఎస్కే… అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ సంస్థను ప్రారంభించి దేశంలో 14 ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం వెనుక ఉన్నది సునీల్ కనుగోలు తెలివితేటలే. సునీల్ కనుగోలు కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సునీల్ కనుగోలు కుటుంబం విజయవాడ నుంచి వలస వెళ్లినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్.. ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశాడు. ఆ తర్వాత భారత్ కు వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ లో చేరాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంస్థ నుంచి విడిపోయి సొంతంగా సంస్థను స్థాపించి, కొద్దికాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

అయితే, సొంత పబ్లిసిటీ పెద్దగా ఇష్టపడని సునీల్ కనుగోలు ఇతర పార్టీలకు పబ్లిసిటీ కల్పించడంలో మాత్రం దిట్ట. ఆ విషయం తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో నిరూపితమైంది. 2022 నుంచి సునీల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. గతంలో బీజేపీ కోసం తాను ఉపయోగించిన వ్యూహాలనే ఇప్పుడు కాంగ్రెస్ కోసం అమలు చేసి సక్సెస్ అయ్యాడీ సరికొత్త చాణక్యుడు. కాంగ్రెస్ తో జట్టుకట్టిన తొలినాళ్లలోనే సునీల్ ప్లానింగ్ లో పదును ఏంటో సోనియా గాంధీ గుర్తించారు. అందుకే అతడ్ని తమ లోక్ సభ ఎలక్షన్స్-2024 టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా నియమించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ కనుగోలు సాధించిన తొలి విజయం కర్ణాటక అసెంబ్లీని చేజిక్కించుకోవడం అయితే, ఆ తర్వాతి విజయం భారత్ జోడో యాత్ర. 2022 సెప్టెంబరు 7 నుంచి 2023 జనవరి 30 వరకు 14 రాష్ట్రాల మీదుగా రాహుల్ గాంధీ 4,080 కిలోమీటర్ల మేర సాగించిన భారత్ జోడో యాత్ర రూపకల్పన వెనుక ఉన్నది కూడా సునీల్ కనుగోలే.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలవకముందు సునీల్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో వివిధ పార్టీల కోసం పనిచేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మైని నేరుగా టార్గెట్ చేసే విధంగా పేసీఎమ్, 40 పర్సెంట్ సర్కార వంటి విమర్శనాస్త్రాలకు రూపకల్పన చేసింది కూడా సునీలే. అంతేకాదు, తమిళనాడులో 2015 ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ కోసం నమకు నామే (మనకు మనే పాలించుకుందాం) అనే నినాదాన్ని కూడా సునీలే సిద్ధం చేశాడు. 39 ఏళ్ల సునీల్ కనుగోలుపై వివాదాలు కూడా ఉన్నాయి. 2022 డిసెంబరులో తెలంగాణ పోలీసులు సునీల్ కు చెందిన మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థ కార్యాలయంపై దాడులు చేపట్టారు. సీఎం కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పార్టీ పైనా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలకు దిగారు. అయితే ఈ దాడులు కక్ష సాధింపు చర్యలంటూ అప్పట్లో కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో విడదీయరాని భాగమయ్యాడు! అతడి తదుపరి లక్ష్యాల్లో ఒకటైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..