AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేలు వీరే.. లిస్టులో ఎవరెవరున్నారంటే.?

మార్పు కావాలి అనే నినాదం.. ఆరు గ్యారెంటీల విధానంతో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్‌. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలు హస్తగతమయ్యాయి. ఐతే  గ్రేటర్‌ హైదరాబాద్‌లో  మాత్రం గులాబీ వికసించింది. గ్రేటర్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌  07 స్థానాల్లో బంపర్‌ విక్టరీ సాధించింది. ఎప్పట్లానే ఎంఐఎం 07 సీట్లను గెలిచి తనపట్టు నిలుపుకుంది.

Telangana Elections: తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేలు వీరే.. లిస్టులో ఎవరెవరున్నారంటే.?
List Of Mlas Who Obtained Highest Majority In Telangana Elections
Srikar T
| Edited By: |

Updated on: Dec 04, 2023 | 12:32 PM

Share
మార్పు కావాలి అనే నినాదం.. ఆరు గ్యారెంటీల విధానంతో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది కాంగ్రెస్‌. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలు హస్తగతమయ్యాయి. ఐతే  గ్రేటర్‌ హైదరాబాద్‌లో  మాత్రం గులాబీ వికసించింది. గ్రేటర్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌  07 స్థానాల్లో బంపర్‌ విక్టరీ సాధించింది. ఎప్పట్లానే ఎంఐఎం 07 సీట్లను గెలిచి తనపట్టు నిలుపుకుంది. ఇక గోషామహాల్‌లో రాజాసింగ్‌ హ్యాట్రిక్‌ విక్టరీతో ఒకే ఒక్క స్థానం బీజేపీ ఖాతాలో చేరింది.
గ్రేటర్‌లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడమే కాదు అత్యధిక మెజార్టీలో టాప్‌లో నిలిచింది బీఆర్ఎస్. కుత్బుల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేకానంద గౌడ్‌.. 85వేల 576 ఓట్ల మెజార్టీతో రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. వార్‌ వన్‌ సైడ్‌ అనే రేంజ్‌లో కొలన్ హన్మంతరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌పై వివేకానంద విజయం సాధించారు. విశ్వనగరిగా హైదరాబాద్‌ అభివృద్ధి, బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారాయన. సీమాంధ్రుల ఓటు బ్యాంక్‌ను తన వైపు టర్న్‌ చేసుకోవడంలోనూ వివేకా సక్సెస్‌ అయ్యారనేది విశ్లేషకులు మాట. తెలంగాణ మూడవ సారి జరిగిన ఎన్నికల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు వివేకానంద. ఇక రెండో స్థానం హరీష్‌రావుది. తన అడ్డా సిద్ధిపేటలో 82వేల 308 ఓట్ల మెజార్టీ సాధించారు హరీష్‌రావు. గత ఎన్నికల్లో  ఆయనకు లక్షకు పైగా మెజార్టీ వచ్చింది. హయ్యస్ట్‌ లీడ్లో ఫస్ట్‌, సెకండ్‌, ధర్డ్‌ ప్లేస్‌ కూడా బీఆర్‌ఎస్‌దే. కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 70వేల 387 ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
కాంగ్రెస్‌లో అత్యధిక మెజార్టీ రికార్డును కైవసం చేసుకున్నారు వేముల వీరేశం. నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై 68వేల 839 ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు వేముల వీరేశం. నిజానికి 2014లో ఎన్నికల్లో వేముల వీరేశం బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలిచారు. అయితే 2018లో మాత్రం ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చిరుమర్తి చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో ఈ ఇద్దరు నాయకులు పార్టీలు మారారు. చిరుమర్తి బీఆర్‌ఎస్‌ గూటికి వెళ్తే.. వేముల వీరేశం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి రికార్డు మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఇక మంచిర్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేమ్‌ సాగర్‌ రావు 66 వేల 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంచిర్యాలలో తనకు తిరుగులేదని చాటుకున్నారాయన.  కోదాడలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సతీమణి పద్మావతి  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లయ్యయాదవ్‌పై గెలుపొందడమే కాదు రికార్డు క్రియేట్‌ చేశారు.  గత ఎన్నికల్లో కోదాడలో 6వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు 58వేల 172 ఓట్ల భారీ మెజార్టీతో
కోదాడను హస్తగతం చేసుకున్నారామె.
ఇల్లందులో కాంగ్రెస్‌ అభ్యర్థి కోరం కనకయ్య బిగ్‌ విక్టరీ నమోదు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియను 57వేల  309 ఓట్ల తేడాతో ఓడించారు. రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌  56 వేల 352 భారీ మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ కు మూడు దశాబ్ధాలుగా అందని విజయం ఈసారి వరించింది. ఖమ్మంలో గుమ్మాన్ని కాంగ్రెస్‌ సింహాద్వారంగా చేయడంలో  కీలక పాత్ర పోషించిన పొంగులేటి, తుమ్మల రికార్డు  స్థాయిలో మెజార్టీ సాధించారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి 57వేల భారీ  మెజార్టీ సాధించారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు 50వేల పై చిలుకు ఓట్లతో విక్టరీ కొట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  జానారెడ్డి కుమారుడు  జైవీర్‌ రెడ్డి  నాగార్జునసాగర్‌లో జయకేతనం ఎగరేశారు.  తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. 55 వేల 849 ఓట్ల భారీ మెజార్టీతో సూపర్‌ విక్టరీ సాధించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి  విజయరమణారావు 55వేల 108 ఓట్లతో.. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54 వేల  332 ఓట్లతో భారీ విజయాల్ని నమోదు చేసుకున్నారు.
దుబ్బాకలో  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  కొత్త ప్రభాకర్‌ రెడ్డి    53 వేల 07- ఓట్లతో .. భూపాలపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి  గండ్ర సత్యనారాయణ  51వేల 975 ఓట్లతో ..మల్కాజ్‌గిరిలో మంత్రి మల్లన్న అల్లుడు ,బీఆర్‌ఎస్‌ అభ్యర్థి  మర్రి రాజశేఖర్‌ రెడ్డి  49వేల ఓట్లతో విజయం సాధించారు. నిర్మల్‌లో బీజపీ అభ్యర్థి  మహేశ్వర్‌రెడ్డి -49,364 ఓట్ల మెజార్టీతో.. ఆలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య- 49,363 మెజార్టీతో గెలిచారు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి  48,782  ఓట్ల మెజార్టీ సాధించారు. పాలకుర్తిలో యశస్వినిరెడ్డి 47,102 ఓట్ల మెజార్టీ సాధించారు. గజ్వేల్‌లో కేసీఆర్‌.. ఈటల రాజేందర్‌పై  45,175 ఓట్ల మెజార్టీతో  గెలిచారు. ఇక సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై కేసీఆర్ తనయుడు కేటీఆర్ 28వేల ఓట్ల మొజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌‌పై 45,174 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బరిలో దిగిన అక్బరుద్దీన్ ఆరోసారి కూడా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఎం సీతారాం రెడ్డి, కాంగ్రెస్ నుంచి బోయ నగేష్, బీజేపీ నుంచి కౌడి మహేందర్ బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..