Assembly Election Results 2023: 2 శాతం ఓట్ల తేడా.. ఓ రాష్ట్రంలో అధికారం.. మరో చోట పరాభవం

2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రీ-ఫైనల్స్‌గా ప్రచారం జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఆదివారం 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థులతో పోరాడింది. అందులో రెండు రాష్ట్రాల్లో కేవలం 2 శాతం ఓట్ల తేడా కాంగ్రెస్ తలరాతను మార్చేసింది.

Assembly Election Results 2023: 2 శాతం ఓట్ల తేడా.. ఓ రాష్ట్రంలో అధికారం.. మరో చోట పరాభవం
Voting
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2023 | 11:48 PM

ఎన్నికల రాజకీయాల్లో ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా పార్టీల తలరాతలు మార్చేస్తుంది. గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ సాధించిన ఓట్లలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ సాధించిన సీట్లలో మాత్రం చాలా తేడా వచ్చేస్తుంది. ఫలితంగా అధికారం చేజారడమో.. లేక మెజారిటీ మార్కు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రీ-ఫైనల్స్‌గా ప్రచారం జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఆదివారం 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థులతో పోరాడింది. అందులో రెండు రాష్ట్రాల్లో కేవలం 2 శాతం ఓట్ల తేడా కాంగ్రెస్ తలరాతను మార్చేసింది. అవును.. కేవలం 2 శాతం తేడాతోనే కాంగ్రెస్ తెలంగాణలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. అంతే తేడాతో రాజస్థాన్‌లో అధికారాన్ని కోల్పోయింది.

2 శాతం తేడాతో 25 సీట్ల ఆధిక్యం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు కాంగ్రెస్ 64 సీట్లు సాధించింది. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 39 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 60 సీట్లు సాధించాలి. కాంగ్రెస్ సొంతంగానే 64, మిత్రపక్షం సీపీఐ 1 సీటు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కాస్త ఎక్కువ సీట్లే సాధించింది. ఇదేమీ భారీ విజయం కానప్పటికీ అధికారం పీఠం మాత్రం చేజిక్కించుకోగలిగింది. కానీ రాష్ట్ర ఓటర్లలో ఆ పార్టీ సాధించిన ఆదరణ ఎంత అంటే.. బీఆర్ఎస్ కంటే కేవలం 2 శాతం మాత్రమే అధికం. బీఆర్ఎస్ 37.35 శాతం ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ 39.40 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ 2% అదనపు ఓట్లు తన ప్రత్యర్థి కంటే ఏకంగా 25 సీట్లు అదనంగా తెచ్చిపెట్టింది.

ఇవే ఎన్నికల్లో మరో ఆసక్తికర పరిణామం ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (AIMIM)కు, బీజేపీకి మధ్య చోటుచేసుకుంది. కేవలం 2.22% ఓట్లతో ఎంఐఎం ఏకంగా 7 సాధించగా.. 13.90% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. కేవలం 0.34 శాతం ఓట్లు సాధించిన సీపీఐ ఒక సీటు గెలుచుకోగా.. 1.37 శాతం ఓట్లు సాధించిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఆయా పార్టీలు అన్ని స్థానాల్లో పోటీ చేయకపోవడం, రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే పూర్తి పట్టు కలిగి ఉండడం వంటి కారణాలే ఈ తరహా ఫలితాలకు ఆస్కారం ఇచ్చాయి.

హోరాహోరీగా పోరాడిన బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు సైతం రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా ప్రభావాన్ని చూపలేదు. జిల్లాలవారిగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ తన ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. కేవలం ఈ నాలుగు (పాత) జిల్లాల్లో 41 సీట్లు సాధించింది. కానీ రాష్ట్ర రాజధాని కొలువైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏమాత్రం అధిక్యతను చాటుకోలేకపోయింది. అక్కడ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఆధిక్యాన్ని చాటుకోగా.. చాలాచోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ముక్కోణపు పోటీ కనిపించింది. పాత ఆదిలాబాద్ జిల్లాలో 10 స్థానాలకు కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2, బీజేపీ 4 గెలుచుకోగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని 9 స్థానాలకు కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2, బీజేపీ 3 గెలుచుకుంది.

రాజస్థాన్‌లో కొంప ముంచిన 2 శాతం ఓట్లు

రాజస్థాన్‌లో గత మూడున్నర దశాబ్దాలుగా ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా మరోసారి గెలవలేదు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తాజా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 7 హామీలు ఈసారి ఆ ఆనవాయితీకి చరమగీతం పాడతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది. ఇంత హోరాహోరీ పోరులో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సైతం ఎవరు గెలుస్తారన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఎందుకంటే రెండు పార్టీలు సాధించిన ఓట్ల మధ్య వ్యత్యాసం కేవలం 2 శాతం మాత్రమే. ఈ స్వల్ప తేడా కారణంగానే ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. అంతేకాదు.. కాంగ్రెస్ తలరాత కూడా తారుమారై అధికారం చేజారింది.

కాంగ్రెస్ 39.53 శాతం ఓట్లు సాధించగా.. బీజేపీ 41.69 శాతం ఓట్లు సాధించింది. కానీ సాధించిన సీట్ల మధ్య మాత్రం చాలా తేడా వచ్చేసింది. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వాటిలో బీజేపీ 115 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం 68 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే 2 శాతం ఓట్ల తేడా సీట్ల విషయానికి వచ్చేసరికి ఏకంగా 47 సీట్ల తేడాను తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 101 సీట్ల కంటే బీజేపీకి అదనంగా 14 సీట్లు కట్టబెట్టింది. అలా కాంగ్రెస్ ఓ రాష్ట్రంలో 2 శాతం ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని కైవసం చేసుకోగా.. మరో చోట ఉన్న అధికారాన్ని చేజార్చుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :