Telangana: 6 బెర్తులు.. 15 మంది పోటీ.. తెలంగాణ కేబినెట్‌లో మిగిలిన పదవులపై కొనసాగుతోన్న ఉత్కంఠ..
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్నది ఆరు బెర్తులే.. కానీ 15 - 16 మంది పోటీ పడుతున్నారు. తమదైన స్టైల్‌లో లాబీయింగ్ మొదలెట్టేశారు. సీటు తమకే వస్తుందంటే.. తమకే వస్తుందని ఖర్చీప్ పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇంతకీ కేబినెట్ రేసులో ఉన్న ఆ నేతలు ఎవరు? వాళ్లలో ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?
Telangana Cabinet: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వాళ్లకి శాఖలు కూడా కేటాయించారు. రేవంత్ బలగంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఏకంగా 15 మందికి పైగా పోటీపడుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసి ఓడిన వాళ్లు, అసలు పోటీ కూడా చేయని వాళ్లు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు.
వాళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, మధుయాష్కి, అద్దంకి దయాకర్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సహా పలువురు కీలక నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీళ్లంతా తమదైన స్టైల్‌లో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారీ నేతలు. అయితే జిల్లాలు, ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగానే మిగిలిన కేబినెట్ బెర్తులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం..
ప్రస్తుతం మంత్రులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, నల్గొండ నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సీఎంతో పాటు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. కరీంనగర్ నుంచి కూడా పొన్నం, దుద్దిళ్లకు కేబినెట్ బెర్త్ దక్కింది. ఇక వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ.. మెదక్ నుంచి దామోదర రాజనర్సింహా.. టీమ్ రేవంత్‌లో భాగమయ్యారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రస్తుతం ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోలేదు. కాబట్టి ఆ జిల్లాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
ఆదిలాబాద్‌లో గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ..
ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం లాబీయింగ్ మొదలెట్టేశారు. రేవంత్ మీద వివేక్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ వినోద్ ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ తనకు మంత్రి పదవి కావాలని పార్టీ అధిష్టానానికి వినతిపత్రం ఇవ్వడంతో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ తేల్చుకోలేకపోతోంది.
మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ.. కేబినెట్ రేసులో బోధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు..
ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన నిజామాబాద్ అర్బన్‌లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు.
ఫిరోజ్‌ఖాన్‌కు కేబినెట్ బెర్త్ అవకాశాలు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు కేబినెట్ బెర్త్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. గ్రేటర్ నుంచి మైనంపల్లి హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కూడా కేబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే బాలూనాయక్‌కి అవకాశం ఉండనుంది.
వారం, పది రోజుల్లో ఫుల్ కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది. అందుకే ఆశావహులంతా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..