AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓవైపు ప్రమాణస్వీకారాల పర్వం.. మరోవైపు మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైళ్లు మాయం.. కలకలం రేపుతోన్న సామాగ్రి తరలింపు..

చోరీ కే పీఛే క్యా హై? కౌన్‌ థా!.. మాజీ మంత్రుల పేషీల నుంచి కీలక ఫైళ్లు గల్లంతయ్యాయా? ఫైళ్ల చోరీ వెనుక కతేంటి? అసలు నిజాలేంటి?.. హైదరాబాద్‌లో వరుస ఘటనలపై సకల జనుల్లో చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఇలా మారిందో లేదో అలా మాజీ మంత్రుల ఆఫీసుల్లో సామాగ్రి తరలింపు ఓ రచ్చగా మారింది. అంతేకాదు ఫైళ్ల మాయానికి యత్నించారనే మ్యాటర్‌ కేసుల వరకు వెళ్లింది కూడా.

Telangana: ఓవైపు ప్రమాణస్వీకారాల పర్వం.. మరోవైపు మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైళ్లు మాయం.. కలకలం రేపుతోన్న సామాగ్రి తరలింపు..
Telangana News
Venkata Chari
|

Updated on: Dec 10, 2023 | 7:09 AM

Share

Telangana: రవీంద్రభారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆఫీసు నుంచి కంప్యూటర్లు ఇతరాత్ర సామాగ్రిని తరలింపును ఓయూ విద్యార్ధులు అడ్డుకున్నారు. ఆ రచ్చ సద్దుమణగకముందే లేటెస్ట్‌గా మాపటేళ ఫైళ్ల మాయం సంచలనం రేపింది. బషీర్‌బాగ్‌లోని విద్యా పరిశోధన్‌ శిక్షణ సంస్థ నుంచి దుండగులు ఫైళ్లను తస్కరించి ఆటోలో తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. దుండగులు ఆటోను వదలి పరారయ్యారు. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబిత చాంబర్‌ ఉంది. ఫైళ్ల చోరీకి జరిగిన యత్నం హాట్‌ టాపిక్‌గా మారింది.

అటు పశుసంవర్ధకశాఖలో ఫైల్స్‌ చోరీ యత్నం ఘటనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ OSD కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడమే కాకుండా మరికొన్ని ఫైళ్లను చిందరవందరగా పడేశారని.. ఆఫీసులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్‌‌మెన్ ఫిర్యాదుతో తలసాని ఓఎస్‌డీ కల్యాణ్‌ సహా ఆపరేటర్‌ మోహన్‌, వెంకటేష్‌, ప్రశాంత్‌ అనే వ్యక్తులపై ఐదు సెక్షన్ల కింద కేసు ఫైల్‌ చేశారు నాంపల్లి పోలీసులు. ముఖ్యమైన ఫైల్స్‌ను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఫైల్స్‌ ఉన్నాయి, ఏవి మిస్సయ్యాయి? కన్‌ఫర్మేషన్‌ కోసం ఫోన్‌ చేస్తే పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ రాంచందర్‌ రెస్పాండ్‌ కాలేదట. ఫైళ్ల మాయం కేసులో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైడ్‌ యాంగిల్‌లో ఎంక్వయిరీ కొనసాగుతోంది.

తలసాని, సబితా ఆఫీసుల్లో ఫైళ్ల తరలింపు యత్నం జరిగిందనే ఆరోపణలు తాజా సంచలనం. రీసెంట్‌గా రవీంధ్రభారతి ప్రాంగణంలో వున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆఫీస్‌ నుంచి కంప్యూటర్లు, ఫర్నీచర్‌ సహా డాక్యుమెంట్లను తరలింపుపై రచ్చ రోడ్డెక్కింది. ప్రభుత్వానికి చెందిన సామాగ్రిని ఎలా తరలిస్తారంటూ ఓయూ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు కూడా నమోదయింది. టోటల్‌ ఎపిసోడ్‌పై సీఎస్‌ శాంతకుమారి స్పందించారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, మంత్రుల పేషీల్లో సామగ్రి అంతా ప్రభుత్వానిదేనన్నారు. ఒక వేళ సొంత వస్తువులేవైనా వున్నా సరే సంబంధిత అధికారుల అనుమతి లేకుండా తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇప్పటికే సామాన్లు కానీ ఫైళ్లు కానీ తీసుకెళ్లి వుంటే వాటిని రికవరీ చేస్తామన్నారు సీఎస్‌.

ఎందుకిలా జరుగుతోంది. నిజంగా ఫర్నీచర్‌, కంప్యూటర్లు ఇతరాత్ర సామాన్లే తరలించే యత్నం జరుగుతుందా? లేదంటే కీలక ఫైళ్లను మాయం చేసే ప్రయత్నం జరిగిందా? నిబంధనల ప్రకారం పేషీలోని సామాగ్రిని జీఏడీకి అప్పగించే ప్రయత్నమే తప్ప ఫైళ్లను తీసుకెళ్లలేదని ఒక వెర్షన్‌. మరోవైపు ఫైళ్లను మాయం చేసేందుకు యత్నించారనే అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు కూడా. మరి ఏది నిజం? ఎవరు నిజం? జస్ట్‌ ఫర్నీచర్‌ తరలింపునేనా? లేదంటే కీలకు ఫైళ్లను మాయం చేశారా?.. అదే నిజమైతే.. ఫైల్‌ చోరీ కా పీఛే క్యా హై..? కౌన్‌ థా? పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిజానిజాలేంటో ఇక విచారణలో తేలాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..