Telangana: సర్కార్ బడిలో చదువు కోసం తంటాలు.. విద్యార్థులకు ఇంకా అందని పుస్తకాలు..!
Telangana: పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితి. కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం
Telangana: పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితి. కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం అని ప్రభుత్వం పదే పదే చెబుతున్న కూడా అది ఎక్కడ సరిగ్గా అమలు కావడం లేదు. ప్రభుత్వ బడులు రీ ఓపెన్ అయి వారంరోజులు గడుస్తున్న కూడా ఇప్పటికే చాలా బడులలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు బడుల్లో చదివే ఆర్థికస్థోమత లేనివారే ఇలా ప్రభుత్వ పాటశాలల్లో చదువుతున్నారు. అలాంటి వీరికి ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ లు ఇంకా అందలేదు. ముఖ్యంగా బడుల్లో చదువుకొవడానికి పుస్తకాలు రాకపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వ బడులు మొదలై వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు చాలా పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు రాలేదు. దీనితో ఎం చేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు పోయిన తరగతి పాఠాలనే మళ్ళీ చెబుతున్నారు. అంటే గత సంవత్సరం నాలుగో తరగతి పాస్ అయ్యి, ఇప్పుడు కొత్తగా ఐదవ తరగతికి వచ్చిన విద్యార్థులకు మళ్ళీ నాలుగవ తరగతి పాఠాలే చెబుతున్నారు. దీనికి కారణం ఇంకా పుస్తకాలు రాకపోవడమే. ఇక యూనిఫామ్ ల విషయానికి వస్తే ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలకి కూడా ఇప్పటి వరకు ఒక్క యూనిఫామ్ రాలేదు. దీనీతో చాలా మంది విద్యార్థులు పాత యూనిఫామ్ ఉంటే అవి లేందంటే సివిల్ డ్రెస్సులోనే బడులకు హాజరు అవుతున్నారు.
పుస్తకాలు,యూనిఫామ్ ల గురించి జిల్లాల వారీగా వివరాలు చూస్తే.. సంగారెడ్డి జిల్లాలో మొత్తం1800 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 1,35,67 మంది అమ్మాయిలు, 1,44,646 మంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం 2,79,713 మంది విద్యార్థులు వివిధ రకాల పాఠశాలలో చదువుతున్నారు.. వీరికి 10,88,836 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నాయి. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాకు వచ్చిన పాఠ్యపుస్తకాలు 3,94,250 కాగా ఇంకా రావాల్సినవి 6,94,586. ఇక సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1,048 ప్రభుత్వ స్కూల్స్ ఉండగా, 55,000 మంది అమ్మాయిలు, 57,000 మంది అబ్బాయిలు ఉన్నారు.. మొత్తం 1,12,000 మంది విద్యార్థులు వివిధ రకాల పాఠశాలలో చదువు తున్నారు. వీరికి 7,13,654 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు వచ్చిన పాఠ్యపుస్తకాలు 3,20,827 రాగ.. ఇంకా రావాల్సినవి 3,92,827 ఉన్నాయి.
ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే జిల్లాలో 945 ప్రభుత్వ స్కూల్స్ ఉండగా అందులో 48,207 మంది అమ్మాయిలు ఉండగా 47,228 మంది అబ్బాయిలు ఉన్నారు.. మొత్తం 95,435 మంది విద్యార్థులు వివిధ రకాల పాఠశాలలో చదువు తున్నారు. వీరికి 6,74,530 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటివరకు జిల్లాకు వచ్చిన పాఠ్య పుస్తకాలు 2,5,800 పుస్తకాలు వచ్చాయి. ఇంకా రావల్సిన పుస్తకాలు 4,68,730 ఉన్నాయి.
ఇలా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ బడుల్లో పాఠ్యపుస్తకాలు అందినాకుడా ఇంకా చాలా పాటశాలలకు బుక్స్ రావాల్సి ఉన్నాయి. యూనిఫామ్ లు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క పాటశాలలకు రాలేదు. సాధారణంగా జనవరిలోనే పుస్తకాలు, యూనిఫామ్ లు రావాలి కానీ ఈసారి అలా జరుగలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,793 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 4,87,148 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 2,38,268 మంది అమ్మాయిలు, 2,48,874 అబ్బాయిలు ఉన్నారు. వీరికి సంవత్సర కాలంలో సగటున వారి వారి తరగతులను బట్టి మొత్తం 24,77,20 పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం అవసరం అవుతున్నాయి. కానీ, ప్రస్తుతానికి కేవలం పాఠశాలలకు చేరేది మాత్రం 9,20,8 77 పాఠ్య పుస్తకాలు మాత్రమే. ఇంకా 15,56,143 పాఠ్యపుస్తకాలని ప్రభుత్వం పాఠశాలలకు తరలించాల్సి ఉంది. ఇక యూనిఫామ్ విషయానికి వస్తే పాఠశాలలకు పంపిణీ కావడానికి కనీసం మరో నెల రోజులు పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. అయితే తరగతులు మొదలై పది రోజులు గడుస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు రాకపోవడంతో గత సంవత్సరంలో చదివిన చదువులనే రివిజన్ పేరిట విద్యార్థులతో తిరిగి చదివిస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల తమ విద్యా విధానం పూర్తిగా పడిపోయిందని కనీసం ఇప్పుడైనా చదువు నేర్చుకోవడానికి వస్తే ఇంకా పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో తమ తరగతికి సంబంధించిన అంశాలను కూడా చదవ లేక పోతున్నామని, గత సంవత్సరం చదివిన పాఠ్యాంశాలను తిరిగి కొత్తగా చదవాల్సి వస్తుందని దీనివల్ల సంవత్సరం చివరలో తమకు పూర్తిస్థాయిలో పాఠ్యాంశాలను బోధించలేరో ఏమోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించడంతో పుస్తకాల ప్రింటింగ్ ఆలస్యమవుతుందని అంటున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుతం వచ్చే పాఠ్యాంశాలు ఒక వైపు తెలుగు, మరొకవైపు ఆంగ్ల మాధ్యమంలో ఉంది కాబట్టి అంత వరకు విద్యార్థులు నష్టపోకుండా ఉండడానికి బ్రిడ్జికోర్స్ తో పాటు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇలాంటి విషయాలను చెబుతున్నామని, త్వరలోనే స్కూళ్ళకి పాఠ్యపుస్తకాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ తమదైన శైలిలో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూ ఏకంగా పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పుస్తకాలు కూడా రాకపోవడంతో విద్యార్థులు వారితో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్స్ ని త్వరితగతిన, సాధ్యమైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.