Telangana: భారీ వర్షాలతో పొంగుతున్న వాగులు, వంకలు..టోల్ ప్లాజాల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు..
Nizamabad: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచిస్తున్నారు.అదేవిధంగా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే జిల్లా కేంద్రంలోని టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
నిజామాబాద్, సెప్టెంబర్05: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతునన్నాయి.జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో చెరువులన్నీ నిండుకుండలా మారాయి.తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు గుడిపై నుంచి వాగు ఉదృతంగా ప్రవహించడంతో గుడి లోపలికి వరద నీరు చేరింది. అదేవిధంగా గాంధారి మండలంలోని పెద్దవాగు,పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని వాగు నిన్నటి నుంచి ఉదృతంగా ప్రవహించడంతో ఐదు గ్రామాలైన టేక్రియాల్, చందాపూర్,సంగోజివాడి, కాలోజి వాడి,బ్రాహ్మణపల్లి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలో పలుచోట్ల పదుల సంఖ్యలో పెంకుటిల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షం బీభత్సంగా పడడంతో లోతట్టు ప్రాంతాలలో పంట చేనులలో వర్షపు నీరు నిలిచి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మ కుంట,రుక్మిణికుంట, పంచాముఖి,అయ్యప్ప నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో ఇండ్లలోకి వరద నీరు చేరుడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్, కొత్త బస్టాండ్, సిరిసిల్ల రోడ్, జేపీఎన్ రోడ్ పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జమైంది.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచిస్తున్నారు.అదేవిధంగా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు దండోరా వేయించి హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే జిల్లా కేంద్రంలోని టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, మెదక్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…