Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. ఈ నియోజకవర్గ క్యాడర్ నుంచి వ్యతిరేకత..

రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఘర్ వాపసీ పేరుతో పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇపుడు ఈ ఘర్ వాపసీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‎లో చిచ్చు పెట్టింది.

Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. ఈ నియోజకవర్గ క్యాడర్ నుంచి వ్యతిరేకత..
Telangana Congress
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: Apr 27, 2024 | 6:31 PM

రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఘర్ వాపసీ పేరుతో పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇపుడు ఈ ఘర్ వాపసీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‎లో చిచ్చు పెట్టింది.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు పెంచింది. మరోవైపు ఘర్ వాపసి పేరుతో పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానించింది. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను భారీ మెజారిటీతో దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. నల్లగొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్‎కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఇందుకు సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారట. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్‎లను కలవకుండానే నేరుగా హైదరాబాదు గాంధీభవన్ లో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షి సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరిక మిర్యాలగూడ కాంగ్రెస్‎లో చిచ్చు పెట్టింది. చైర్మన్ భార్గవ్.. చేరికను స్థానిక నేతలు, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్‎లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‎గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భార్గవ్ చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకుల్లారా ఖబర్దార్ అంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

మరోవైపు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి సమక్షంలో భార్గవ్ పార్టీలో చేరటంపై స్థానిక నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఇతర పార్టీల నేతలు చేరడం పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరు చేరాలన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13మంది కౌన్సిలర్ల చేరికతో మిర్యాలగూడ కాంగ్రెస్‎లో చెలరేగిన అలజడిని నివారించేందుకు పిసిసి రంగంలోకి దిగింది. మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఇతర కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లదంటూ.. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. స్థానిక, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండానే పార్టీలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక నాయకత్వంతో చర్చించి భార్గవ్ చేరికపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తమ అభిప్రాయాల మేరకు టిపిసిసి స్పందించి భార్గవ్ చేరికను మద్దతు తెలపడం పట్ల డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎమ్మెల్యే బిఎల్ఆర్ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..