Telangana:ఇవి అలాంటి.. ఇలాంటి చీకులు కాదు.. వీటికి దట్టించే మసాలా చాలా స్పెషల్
భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా నిలుస్తున్న కురుమూర్తి రాయుడు జాతర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. కాంచన గుహలో నూతన శోభతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక జాతరలో ఫేమస్‌గా మారిన కాల్చిన మాంసం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. శ్రీవారి జాతరలో నాన్ వెజ్ ఏంటి అనుకుంటున్నారా..?
ప్రతి ఏటా కార్తీక మాసంలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూరం గ్రామ సమీపంలో శ్రీ కురుమూర్తి జాతర కన్నుల పండువగా జరుగుతుంది. కోరిక కోర్కెలు తీర్చే కురుమూర్తి రాయుడును దర్శించుకునేందుకు మన రాష్ట్రమే కాదు. ఏపీ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొత్తకుండలో దాసంగాలు(నైవేద్యం) సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక కురుమూర్తి జాతరలో చాలా ప్రసిద్ధి చెందిన అంశం… ఇక్కడ కాల్చిన మాంసం. స్వామివారి జాతరలో భాగంగా ఉద్దాల మహోత్సవం పూర్తయ్యాక ఈ కాల్చిన మాంసం గుడిసేలు ప్రారంభమవుతాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు చూపు ఈ మాంసం కాల్చే గుడిసెల వైపే మల్లుతుంది. ఇక్కడ మటన్, చికెన్ మాంసంతో కాల్చే సీకులు చాలా ఫేమస్… టేస్ట్‌లో ఎవరెస్ట్. జాతరకు వచ్చి ఈ కాల్చిన మాంస రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ఈ స్వామివారి జాతరకు కాల్చిన మాంసానికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ గడిచిన కొన్ని దశాబ్ధాలుగా అనవాయితీగా వస్తోంది. జాతర సమయంలో ఇక్కడ లభించే ఈ వంటకం రుచి అదరహో అనిపిస్తుంది… అందుకే అనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. జాతర కొనసాగినన్ని రోజులు ఈ జాతర దగ్గర మరో మినీ జాతర తలపిస్తుంది.
అక్కడి మసాల స్పెషల్…:
సాధారణంగా కాల్చిన మాంసం ఎక్కడైనా దొరుకుంతుంది. కానీ కురుమూర్తి జాతరలో లభించే కాల్చిన మాంసం రుచి మాత్ర వేరు. ఇక్కడ జాతరలో మాంసానికి పట్టించే మసాలా తయారీ ఎంతో ప్రత్యేకం. దాదాపు రెండు నెలల ముందే ప్రత్యేకంగా మసాలాలు తయారు చేస్తారు. నాణ్యమైన 15రకాల మసాల దినుసులను ఇందుకోసం వినియోగిస్తారు. వీటితో తయారు చేసుకున్న మసాలను మాంసంకు పట్టించి కాల్చడంతో ఎంతో రుచి వస్తుందని చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అమరచింతకు చెందిన ఆరె కటికలె జాతరలో కాల్చిన మాంసం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా ఈ దుకాణాలను నెలకొల్పుతారు. సుమారు 50-60 దుకాణాలు ఏర్పాటు చేసి ఈ కాల్చిన మాంసం విక్రయాలు జరుపుతారు. అక్కడే కూర్చోని తినడానికి ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఈ కాల్చిన మాంసం కోసమే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చే వారు ఉన్నారు.
పేదల తిరుపతి కురుమూర్తి జాతరలో ప్రతీది ఎంతో ప్రత్యేకం. ఉత్సవాలకు రావడం, స్వామివారిని దర్శించుకొని, కాల్చిన మాంసం రుచిని ఆస్వాదిస్తున్నారు భక్తులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..