Munugode By Poll: రోజురోజుకు మారుతున్న మునుగోడు ప్రజల మూడ్.. పార్టీల్లో టెన్షన్.. టెన్షన్..

మునుగోడు ప్రజల మూడ్ రోజురోజుకు మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఓటరు నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకే కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదు. మునుగోడులో ధన ప్రవాహం..

Munugode By Poll: రోజురోజుకు మారుతున్న మునుగోడు ప్రజల మూడ్.. పార్టీల్లో టెన్షన్.. టెన్షన్..
Munugode Bypoll
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 24, 2022 | 3:25 PM

ఎన్నికలంటే భారత ప్రజాస్వామ్యంలో ఓ పండుగ లాంటిది. ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఈ ఎన్నికల ద్వారానే ప్రజలు తమ పాలకులను ఎన్నుకుంటారు. వీటిని సాధారణ ఎన్నికలని అంటారు. కాని ఒక్కోసారి అనివార్య కారణాలతో మధ్యలో ఉప ఎన్నికలు వస్తుంటాయి. ఈ ఉప ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరపున అభ్యర్థి ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. అలా అని ప్రతి సందర్భంలో అలాగే జరగాలని లేదు. తెలంగాణలో 2018 తర్వాత జరిగిన నాలుగు ఉప ఎన్నికలను చూస్తే రెండిటిలో అధికారపార్టీ గెలవగా, మరో రెండుస్థానాల్లో ప్రతిపక్ష బీజేపీ గెలిచి, అధికారపక్షానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అనుభవాల దృష్ట్యా.. తెలంగాణలో ఉప ఎన్నికకు కూడా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, ఆరోవ తేదీన ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. తన నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని, తాను ప్రతిపక్ష సభ్యుడిని కావడంతో ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదంటూ మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తున్నారు. దీంతో మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడం, టీఆర్ ఎస్ కు క్షేత్రస్థాయిలో బలం ఉండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ బీజేపీకి కలిసి వస్తుందనే విశ్వాసంతో ఆపార్టీ ఉంది. దీంతో ఇక్కడ మూడు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మరోవైపు మునుగోడు ప్రజల మూడ్ రోజురోజుకు మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఓటరు నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకే కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదు. మునుగోడులో ధన ప్రవాహం ఎక్కువుగా ఉండవచ్చనే ఊహగానాలు ఉండటంతో ఓటర్ల అంచనా కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తమ మనస్సులో ఓటు ఎవరికి వేయాలో ఫిక్స్ అయినప్పటికి.. బయటపడటం లేదు. ఒకవేళ తాము పలానా పార్టీకి వేస్తామని బయటపడితే ఇతర పార్టీల నుంచి ఒత్తిడి రావడంతో పాటు.. ఇతర పార్టీలు ఇచ్చే తాయిలాలు రావేమో అనే అభిప్రాయంలో కొందరు ఓటర్లు ఉన్నట్లు వినిపిస్తోంది. అయినప్పటికి కొంతమంది ఓటర్లు మాత్రం తమ మనసులో ఎవరు ఉన్నారో కుంబద్దలు కొట్టి చెబుతున్నారు.

టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో తిరుగుతూ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలు సైతం గుప్పిస్తున్నారు. నాయకుల పర్యటనలతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఎమ్మెల్యే స్థాయి నాయకులు గ్రామాల్లో ఉండి, ఓటర్లను రోజూ కలుస్తూ తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతో ఓటర్ల మూడ్ కూడా రోజుకో విధంగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసే వరకు ఎవరికి వేస్తారనే విషయంపై స్పష్టంగా చెప్పలేమని అంటున్నారు రాజకీయ పండితులు.

ఇవి కూడా చదవండి

నియోజకవర్గంలో యువతలో ఎక్కువమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని, మహిళల్లో కొంతమంది అధికార టీఆర్ ఎస్ తో పాటు రాజగోపాల్ రెడ్డి వైపు ఉండగా.. వృద్ధుల్లో టీఆర్ ఎస్ తో పాటు దివంగత నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డిపై అభిమానంతో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై కొంత సానుకూలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో చాలా మందికి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేసి ఉండటంతో ఆయన నుంచి సాయం పొందిన వారు పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డిపై అభిమానంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యమ పార్టీతో పాటు, తెలంగాణ సెంటిమెంట్ తో ఉన్నవారు టీఆర్ ఎస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా పోటీ మాత్రం టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఉన్నప్పటికి, బీఎస్పీ కూడా చాపకింద నీరులా చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సంపాదించవచ్చనే చర్చ జరుగుతోంది.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీకి కొండ క్యాడర్ పెరుగుతూ వస్తుంది. అయితే గెలుస్తుందని పక్కాగా చెప్పలేనప్పటికి బీఎస్పీ పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి లాభం కలిగిస్తుంది, ఎవరికి నష్టం కలిగిస్తుంది అనే దాని పైనే చర్చ నడుస్తోంది. మొత్తం మీద మునుగోడు ఓటరు మూడ్ మాత్రం రోజురోజుకు మారుతుండటంతో రాజకీయ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడులో గెలిచేది ఎవరో తేలాలంటే ఈఏడాది నవంబర్ 6వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..