Revanth Reddy: కాంగ్రెస్ ను అంతం చేయాలనే కుట్రను చూస్తూ ఊరుకుంటామా.. పార్టీ నేతలకు రేవంత్ పిలుపు..
మునుగోడు ఉప ఎన్నికలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నింటినీ మునుగోడుకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ...
మునుగోడు ఉప ఎన్నికలో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నింటినీ మునుగోడుకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ పెద్దఎత్తున మోహరించిన నేపథ్యంలో పార్టీ కేడర్‌ను భారీగా మునుగోడుకు రప్పించాలని చూస్తున్నారు. ఇటీవల పరిణామాలను పేర్కొంటూ కాంగ్రెస్ శ్రేణులకు ఆయన బహిరంగ లే రాశారు. నికార్సైన కాంగ్రెసోడా, మునుగోడుకు కదలిరా అంటూ అందులో పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని కార్యకర్తలను ప్రశ్నించారు. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడుతుంటే ఇంట్లోనే ఉంటారా అని కేడర్‌లో కసిని పెంచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని ఇటీవల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. మునుగోడులో కలిసి కదం తొక్కుదాం. ప్రాణమో.. ప్రజాస్వామ్యమో తేల్చుకుందాం అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, అంతా మునుగోడుకు రండి అని విజ్ఞప్తి చేశారు రేవంత్‌రెడ్డి.
ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులైన మనం నిప్పు కణికలై కొట్లాడాలి. కులం,మతం, ఊరూ, వాడ, పల్లె, పట్నం అనే తేదా లేకుండా మునుగోడుకు రావాలి. పార్టీ అభ్యర్థికి అండగా నిలబడాలి. ఆమె గెలుపునకు కృషి చేయాలి. కాంగ్రెస్ ను ఒంటరి చేయాలనుకునే కుట్రను ఖండించాలి. మీ కోసం మునుగోడులో ఎదురు చూస్తాను. ఆడబిడ్డ అని కూడా చూడకుండా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడి జరిగింది. బీజేపీ అభ్యర్ధే పాల్వాయి స్రవంతిపై దాడికి దిగారు. మన కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా. తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియా గాంధీకి ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీపై కుట్ర జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీఎఫ్ , ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలను అడ్డు పెట్టుకొని బీజేపీ , రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికారులతో టీఆర్ఎస్ విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్ పై గుర్తులు, యాదాద్రికి ఓటర్లను తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం వంటి అంశాలను రేవంత్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.