Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం.. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ
ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివరించారు.
అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..